Telugu Global
Telangana

ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌.. టి-వర్క్స్ ప్రారంభం నేడే

సాఫ్ట్ వేర్ రంగంలో టెక్నాలజీ ఆవిష్కరణలకు కేంద్రంగా ఇప్పటికే టి-హబ్ ఉంది. అలాగే హార్డ్ వేర్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు రూపొందించే కేంద్రంగా టి-వర్క్స్ అందుబాటులోకి రాబోతోంది.

ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌.. టి-వర్క్స్ ప్రారంభం నేడే
X

భూమిలో పెట్టే విత్తనం మొదలుకొని, అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్‌ దాకా అన్నింటిలోనూ సృజనాత్మక ఆవిష్కరణలకు టి-వర్క్స్‌ వేదిక కాబోతోందన్నారు మంత్రి కేటీఆర్. భారత్‌ లో ఇప్పటి వరకూ ఎక్కడా ఇలాంటి సంస్థ అందుబాటులో లేదన్నారు. ఇందులో మెటల్‌, త్రీ డి ప్రింటింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, మెట్రాలజీ, ఉడ్‌ వర్కింగ్‌, వెల్డింగ్‌, పెయింట్‌ జాబ్‌, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు.. తదితర విభాగాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈరోజు హైదరాబాద్ లోని రాయదుర్గంలో టి-వర్క్స్ ని ఘనంగా ప్రారంభించబోతున్నారు.


టి-వర్క్స్ అంటే..?

సాఫ్ట్ వేర్ రంగంలో టెక్నాలజీ ఆవిష్కరణలకు కేంద్రంగా ఇప్పటికే టి-హబ్ ఉంది. అలాగే హార్డ్ వేర్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు రూపొందించే కేంద్రంగా టి-వర్క్స్ అందుబాటులోకి రాబోతోంది. ఫాక్స్ కాన్ కంపెనీ చైర్మన్ యంగ్ లు తో కలసి మంత్రి కేటీఆర్ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. టి-వర్క్స్‌ ప్రస్తుతం 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది, భవిష్యత్తులో దీన్ని 2.5 లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తారు.

టి-హబ్, టి-వర్క్స్, ఇమేజ్ టవర్స్..

స్టార్టప్ సంస్థలకు వేదికగా టి-హబ్‌ నిలిస్తే, సృజనాత్మక ఉత్పత్తుల కేంద్రంగా టి-వర్క్స్‌ ఉంటుంది. యానిమేషన్‌, గేమింగ్‌, వన్‌ టైమ్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఈ నాలుగు విభాగాలకోసం ఇమేజ్‌ టవర్స్‌ ని భవిష్యత్తులో ఏర్పాటు చేయబోతున్నారు. ఇమేజ్‌ టవర్స్ లో 1.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన స్థలం అందుబాటులోకి తేవాలనేది ప్రభుత్వ ఆలోచన. పీపీపీ విధానంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది.

మొత్తంగా రాయదుర్గం ఐటీ కారిడార్‌ లో ఒకే చోట సుమారు 18 ఎకరాల్లో టి-హబ్‌, టి-వర్క్స్‌, ఇమేజ్‌ టవర్స్ ని ఏర్పాటు చేసి ఉపాధికి ఢోకా లేకుండా చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన. 9 లక్షలకు పైగా చదరపు అడుగుల స్థలం ప్రభుత్వ పరంగా ఆవిష్కరణ వ్యవస్థల కోసమే అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్.

First Published:  2 March 2023 2:45 AM GMT
Next Story