Telugu Global
Telangana

నీకు న్యాయం జరిగితే చాలా..? మాకేదీ సమన్యాయం..

శ్రీరాంపూర్ లో మట్టి రవాణాను అడ్డుకొని కార్మికులు ఆందోళనకు దిగారు. రెండు నెలల జీతం బకాయిలు 2కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నీకు న్యాయం జరిగితే చాలా..? మాకేదీ సమన్యాయం..
X

కాంగ్రెస్ కి రాజీనామా చేసి, బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్న మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీగా కాంట్రాక్ట్ లు తెచ్చుకున్నారనే ప్రచారం ఉంది. ఆ విధంగా ఆయనకు న్యాయం జరిగిన తర్వాతే పార్టీ మారారని అంటుంటారు. ఆయనకు న్యాయం జరిగింది సరే, ప్రజలకు న్యాయం జరగాలంటే మాత్రం కచ్చితంగా రాజగోపాల్ రెడ్డిని ఓడించాలంటూ వైరివర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కంపెనీ వ్యవహారం రచ్చకెక్కడం విశేషం.

జీతాలకోసం ధర్నా..

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి చెందిన కంపెనీలో రెండు నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదని కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్‌ లో మట్టి తవ్వకాలు, రవాణా నిర్వహించే సుశీ హైటెక్‌ సంస్థ కార్మికులు వారం రోజులుగా విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ వార్తలు బయటకు రాకుండా ప్రయత్నించిన యాజమాన్యం.. వారికి నచ్చజెప్పాలని చూసినా ఫలితం లేకపోయింది. 400 మంది కార్మికులు సంస్థ జీఎం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడంతో రాజగోపాల్ రెడ్డి కంపెనీ వ్యవహారం రచ్చకెక్కింది. శ్రీరాంపూర్ లో మట్టి రవాణాను అడ్డుకొని కార్మికులు ఆందోళనకు దిగారు. రెండు నెలల జీతం బకాయిలు 2కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండగ బోనస్‌ ఇవ్వాలని కోరారు.

ఉప ఎన్నికల ముందు డ్యామేజీ..

సరిగ్గా ఉప ఎన్నిక ముందు రాజగోపాల్ రెడ్డి కంపెనీ వ్యవహారం ఆయన పొలిటికల్ ఇమేజ్ ని డ్యామేజీ చేస్తోందని అంటున్నారు విశ్లేషకులు. 9 నెలలుగా పీఎఫ్‌ డబ్బులు కూడా యాజమాన్యం జమ చేయట్లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమకు జీతాలు ఇవ్వకుండా.. మునుగోడులో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఉద్యోగులు మండిపడ్డారు. వెంటనే కాంట్రాక్టు కార్మికులకు బోనస్‌, పీఎఫ్‌ డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. జీతాలు చెల్లించకుంటే శ్రీరాంపూర్‌ ఓసీపీ నుంచి బొగ్గు ముక్క కూడా బయటికి పోనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కొన్నిరోజులుగా వివాదం జరుగుతున్నా లైట్ తీసుకున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు హడావిడి పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పరువు పోయింది, ఇకపై విమర్శలు బయటకు రాకుండా చూసుకోవాలనుకుంటున్నారట. ఇది వైరి వర్గాల కుట్ర అనే విధంగా ప్రచారం చేయాలని అనుచరులకు చెప్పారట రాజగోపాల్ రెడ్డి.

First Published:  30 Sep 2022 2:03 AM GMT
Next Story