Telugu Global
Telangana

మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరు : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరు : మంత్రి కేటీఆర్
X

మహిళలు బాధ్యతాయుతంగా ఉంటూ నిబద్ధతతో ముందు కెళ్తారని.. వాళ్లు ఏ రంగంలో అయినా రాణించగలరని మంత్రి కేటీఆర్ అన్నారు. యువతకు ఎక్కువగా ఇంజనీర్, డాక్టర్ లేదా లాయర్ అవ్వాలని ఇంట్లో చెప్తారని.. అసలు వాళ్లు వ్యాపారవేత్తలు ఎందుకు కాకూడదని మంత్రి ప్రశ్నించారు. వీ-హబ్ 5వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ వనరులు, సాంకేతికతను వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. మహిళా వ్యాపారవేత్తలకు మాత్రమే కాకుండా స్వయం సహాయక సంఘాలకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ సింగిల్ విండో విధానం అందుబాటులో ఉంటుందని మంత్రి చెప్పారు. దీని వల్ల పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ఒకే చోట అనుమతులు అన్నీ లభిస్తాయని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన యువతులు కేవలం జాబ్ కోసం ప్రయత్నించకుండా.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీ-హబ్, టీ-హబ్‌లను ఉపయోగించుకుంటూ వ్యాపారవేత్తలుగా ఎదగాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

అబ్బాయిలు, అమ్మాయిలు సమానమే అనేది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలిసో తెలియకో అమ్మాయి తక్కువ.. అబ్బాయి ఎక్కువ అనే భావనను మనం ఇంటి నుంచే నేర్పిస్తాము. పిల్లలను అలా పెంచడం మంచిది కాదు. మనం ఎలా పెంచామనేది తల్లిదండ్రులు ఒక సారి సరి చూసుకోవాలని అన్నారు. ఇందుకు మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని కేటీఆర్ కోరారు. మా అమ్మానాన్న నన్ను, నా చెల్లిని బాగా చదివించారు. ఏనాడూ నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ అనే విభేదం చూపించలేదు. మా చెల్లి కవిత యూఎస్ వెళ్తానంటే.. నాకంటే ముందే ఆమెను పంపించారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు మేం కూడా మా పిల్లలను సమానంగా చూస్తున్నాము. వాళ్లు ఏ రంగంలో ముందు కెళ్లాలని అనుకుంటే అలాగే ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కిందపడితే మేం ఉన్నామనే ధైర్యం తల్లిదండ్రులు ఇవ్వగలిగితే.. అమ్మాయైనా, అబ్బాయైనా వంద శాతం అభివృద్ధి సాధిస్తారని కేటీఆర్ అన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్లు వీ-హబ్ సాయంతో సాధించిన విజయాలను చెబుతుంటే చాలా గర్వంగా ఉందన్నారు. మేం సృష్టించిన ఈ రెండు ప్లాట్‌ఫామ్స్ ఎంత బాగా పని చేస్తున్నాయో చెప్పడానికి మీ సక్సెస్ స్టోరీలే నిదర్శనమని కేటీఆర్ అన్నారు.



First Published:  8 March 2023 8:42 AM GMT
Next Story