Telugu Global
Telangana

బస్‌ కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ.. ఎందుకంటే?

మహిళలకు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారంటూ కండక్టర్‌ను బూతులు తిట్టింది. తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకుని బస్సును రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

బస్‌ కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ.. ఎందుకంటే?
X

తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిపై ప్ర‌యాణికుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారాల కిందట హయత్‌నగర్‌లో చిల్లర ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్‌ను కాలితో తన్నింది. ఆ తర్వాత జైలు పాలైంది. ఆ ఘటన మరవకముందే కండక్టర్‌పై మరో మహిళ దాడి చేసింది. తాను దిగాల్సిన చోట బస్సు ఆపలేదని ఆగ్రహించి కండక్టర్‌ను చెప్పుతో కొట్టింది.

మ్యాటర్‌లోకి వెళ్తే.. శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన ప్రసన్న శివరాంపల్లిలో బస్సు ఎక్కింది. ఈమె హైదర్‌గూడ కల్లు కంపౌండ్‌ దగ్గర దిగాల్సి ఉంది. కానీ, ఏమరపాటులో అక్కడ దిగకుండా అత్తాపూర్‌లో దిగింది. మళ్లీ వెనక్కి వెళ్లేందుకుగాను రోడ్డుదాటి మెహదీపట్నం నుంచి ఉప్పల్‌ వెళ్తున్న 300 నంబర్‌ బస్సు ఎక్కింది. దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న బస్‌స్టాప్‌లో దిగేందుకు ప్రయత్నించగా కండక్టర్‌ ఆమెను ఎక్కడ దిగాలని అడిగారు. ఆపమన్న చోట బస్సు ఆపకుండా.. ప్రశ్నలు వేస్తున్నావా అంటూ ఆగ్రహానికి గురైన మహిళ.. చెప్పుతో కండక్టర్‌ చెంపలు చెల్లుమనిపించింది.

మహిళలకు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారంటూ కండక్టర్‌ను బూతులు తిట్టింది. తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకుని బస్సును రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే బస్సు పీఎస్‌ వద్ద ఆగగానే ప్రసన్న అక్కడి నుంచి పరారైంది. కండక్టర్‌ ఫిర్యాదుతో రాజేంద్రనగర్‌ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవ‌ల వరుసగా ఆర్టీసీ సిబ్బందిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఆర్టీసీ సిబ్బందిని ఇబ్బందిని పెడితే కఠిన చర్యలుంటాయని సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఆవేశంలో దాడులకు దిగి జైలు పాలు కావొద్దని కూడా సూచించారు. అయినా సిబ్బందిపై దాడులు ఆగ‌డం లేదు.

First Published:  10 Feb 2024 7:04 AM GMT
Next Story