Telugu Global
Telangana

అర్థంలేని హామీల వర్షం - తేలిపోయిన కాంగ్రెస్‌ వ్యూహం

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిజమైన, ఆచరణాత్మక ప్రణాళికతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ముందు నిలబడాల్సి ఉంది. కానీ, ఆ అవకాశాన్ని కాంగ్రెస్‌ వదులుకుందని తుక్కుగూడ సభలో నేతల ప్రసంగాలు చెప్పకనే చెప్పాయి.

అర్థంలేని హామీల వర్షం - తేలిపోయిన కాంగ్రెస్‌ వ్యూహం
X

తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో కాంగ్రెస్‌ పార్టీ హామీల వర్షం కురిపిస్తుంది. హామీలు ఇస్తే నమ్మదగ్గవిగా ఉండాలి. అవి ఆచరణకు సాధ్యమని జనాలూ విశ్వసించాలి. ఇందుకు భిన్నంగా చేసే వాగ్దానాలు నవ్వుల పాలు చేస్తాయి. ఈ సంగతి రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు తెలియకపోవచ్చు. కానీ, కాంగ్రెస్‌ జాతీయ నాయకులకైనా విజ్ఞత ఉండాలి. అసాధ్యమైన హామీలు ఇస్తే ఎలా నమ్ముతారనే సందేహం రావాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ఆరాటమే తప్ప తగిన వ్యూహం కాంగ్రెస్‌కు లేదని తుక్కుగూడ సభ హామీలతో తేలిపోయింది.

భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గద్దె దింపగలిగే తగిన కార్యాచరణ ప్రణాళిక, వ్యూహం కాంగ్రెస్‌కు కొరవడింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారం ద్వారా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. కానీ, ఆ ‘సంక్షేమ’ పథకాల డొల్లతనాన్ని, దీర్ఘకాలికంగా వాటిల్లబోయే పర్యవసానాల్ని తెలియజెప్పడం ప్రతిపక్ష కాంగ్రెస్‌ బాధ్యత. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిజమైన, ఆచరణాత్మక ప్రణాళికతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ముందు నిలబడాల్సి ఉంది. కానీ, ఆ అవకాశాన్ని కాంగ్రెస్‌ వదులుకుందని తుక్కుగూడ సభలో నేతల ప్రసంగాలు చెప్పకనే చెప్పాయి.

బీఆర్ఎస్ కన్నా మిన్నగా సంక్షేమ పథకాలని అమలు చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. విభిన్న వర్గాలకు నగదు మొత్తాలను నజరానాగా ప్రకటించారు. తాము ఇచ్చే హామీల అమలుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందో, ఆ నిధులని ఎలా సమీకరిస్తామో చెప్పగలగాలి. అలా చెప్పగలిగే స్థితి కాంగ్రెస్‌ పార్టీకి లేదు. అందుకని వీరి హామీలు నమ్మడానికి జనాలు సిద్ధంగా లేరు. అంతేగాక ఇదేవిధమైన హామీలను వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదనే బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు వారి నుంచి జవాబు లేదు, రాదు.

ఉదాహరణకు విద్యార్థుల కోచింగ్‌ ఫీజుకు రూ.5 లక్షల వరకు సహాయం చేస్తామనే మాట అసంగతం. ఇంజనీరింగ్‌, మెడికల్‌ విద్యార్థులకు కూడా ఏటా రూ.5 లక్షల కోచింగ్‌ ఫీజు లేదు. ఇది ఒక డొల్ల హామీ తప్ప ఏమీ కాదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను, అందరికీ సమానమైన, ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ విధి నిర్వహిస్తామని చెప్పగలగాలి. అందుకు బదులుగా నగదు మొత్తాలు ఇస్తామంటే నమ్ముతారా? అలాగే పేదలకు గ్యాస్‌ సిలిండర్‌ 500 రూపాయలకు ఇస్తామనే మాట కూడా నమ్మదగిందిగా లేదు.

ప్రాంతీయ పార్టీలు అధికారంకోసం ఏమైనా మాట్లాడవచ్చు. కానీ, ఒక జాతీయపార్టీగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం కాంగ్రెస్‌కు మంచిది కాదు. ఇది ఆ పార్టీ విశ్వసనీయతకే చేటు. సంక్షేమ పథకాలనేవి తాత్కాలిక ఉపశమనాలే. ఒక దశవరకు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపయోగపడతాయి. అంతే తప్ప ఎప్పుడూ వాటి మీద ఆధారపడే పరిస్థితి ఉండకూడదు. అందుకని ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు తగిన అభివృద్ధి వ్యూహాలు రూపొందించాలి. నగదును అందించే పథకాల వల్ల బతుకులు మెరుగుపడవు.

తెలంగాణలో బీఆర్ఎస్ కన్నా తాము ఏవిధంగా మెరుగైన పాలన అందించగలమో చెప్పలేకపోవడం కాంగ్రెస్‌ వైఫల్యాన్ని సూచిస్తుంది. బీఆర్ఎస్ తరహా హామీలనే ఇస్తే ఆ పార్టీ ఉండగా కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేస్తారు..? బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందన్న మాట వాస్తవం. కానీ, తాము కూడా వారి మాదిరిగా ‘సంక్షేమం’ పేరిట నగదు పంపకాలు చేపడితే అప్పులు మరింతగా పెరగడం ఖాయమ‌ని కాంగ్రెస్ పార్టీ మ‌రిచిందా..? అసలు అప్పులయినా తేగల స్థితి ఉంటుందా అన్నది సందేహం. ప్రారంభించిన పథకాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర బడ్జెట్‌, రాష్ట్రం చేస్తున్న అప్పులు, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఫస్టుకు జీతాలు చెల్లించలేని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు చెబుతూనే ఉన్నాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ కంటే మించి తాము నెలనెలా జనాలకు నగదు ఇస్తామని చెప్పడం కాంగ్రెస్‌ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనం. అప్పులపాలైన రాష్ట్ర ఆర్థికవ్యవస్థను చక్కదిద్దే ఆచరణాత్మక మార్గాలు చెప్పలేని వారి బలహీనతను సూచిస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, మధ్యతరగతి వర్గాలు, మేధావి వర్లాల్లోని ఒక సెక్షన్‌ నిన్నమొన్నటివరకు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలబడాలనుకున్నాయి. కానీ, తుక్కుగూడ సభలో కాంగ్రెస్‌ హామీల వర్షం చూశాక బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు మ‌ధ్య తేడా ఏముందని పెదవి విరుస్తున్నాయి. తిరిగి అధికారంలోకి రావాలన్న ఆరాటమే తప్ప తగిన వ్యూహం కాంగ్రెస్‌కు కొరవడిందని తుక్కుగూడ సభ తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయం కోసం చూసే వారికి దిక్కులేని పరిస్థితి కల్పించింది. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌ ఎంత గందరగోళంలో, అయోమయంలో, వ్యూహలేమితో కుదేలైపోయిందో తుక్కుగూడ సభ తేటతెల్లం చేయడమే అసలు విషాదం.

First Published:  18 Sep 2023 6:16 AM GMT
Next Story