Telugu Global
Telangana

ఈకేంద్ర బడ్జెట్లోనైనా తెలంగాణకు కొత్త రైల్వే ప్రాజెక్టులు వస్తాయా ?

కేంద్ర బడ్జెట్ సమర్పణకు కేవలం ఒక్క‌ రోజు మాత్రమే మిగిలి ఉన్నందున, రైల్వే మంత్రిత్వ శాఖకు SCR అధికారులు ఎలాంటి ప్రతిపాదనలు పంపారో తెలంగాణ ఎంపీలకు తెలియదు. తెలంగాణలో 17 మంది లోక్‌సభ ఎంపీలు ఉండగా, వారిలో 9 మంది బీఆర్‌ఎస్‌కు, నలుగురు బీజేపీకి, ముగ్గురు కాంగ్రెస్‌కు, ఒకరు ఏఐఎంఐఎంకు చెందినవారు.

ఈకేంద్ర బడ్జెట్లోనైనా తెలంగాణకు కొత్త రైల్వే ప్రాజెక్టులు వస్తాయా ?
X

ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ కు ముందు దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలు స్వీకరించడం కోసం దాని పరిధిలో ఉన్న లోక్ స‌భ, రాజ్యసభ సభ్యులతో ప్రీ-బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే కోవిడ్-19 నిబంధనల కారణంగా 2020 నుంచి ఈ సమావేశాలను రద్దు చేశారు. ఈ సారి కూడా సమావేశం జరగలేదు.

దీని వల్ల‌ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల‌ విషయాలపై రైల్వే అధికారులతో చర్చించే అవకాశం రాష్ట్రాలకు లేకుండా పోయింది. ఎంపీలతో చర్చించకుండానే ఇప్పుడు స్థానిక అధికారులు నేరుగా రైల్వే మంత్రిత్వ శాఖకు తమ ప్రాతిపాదన‌లను పంపవలసి వస్తుంది. ఎంపీలు కూడా నేరుగా ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపాల్సి వస్తున్నది.

కేంద్ర బడ్జెట్ సమర్పణకు కేవలం ఒక్క‌ రోజు మాత్రమే మిగిలి ఉన్నందున, రైల్వే మంత్రిత్వ శాఖకు SCR అధికారులు ఎలాంటి ప్రతిపాదనలు పంపారో తెలంగాణ ఎంపీలకు తెలియదు. తెలంగాణలో 17 మంది లోక్‌సభ ఎంపీలు ఉండగా, వారిలో 9 మంది బీఆర్‌ఎస్‌కు, నలుగురు బీజేపీకి, ముగ్గురు కాంగ్రెస్‌కు, ఒకరు ఏఐఎంఐఎంకు చెందినవారు. రాష్ట్రంలోని ఏడుగురు రాజ్యసభ సభ్యులు అధికార BRS పార్టీకి చెందినవారే. చాలా మంది ఎంపీలు నేరుగా రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్‌ కావడంతో పాటు తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో ఈ ఏడాదిలోగా ఎన్నికలు జరగనున్నందున, కొత్త రైల్వే ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు కోసం 11 ప్రాజెక్టులు వెయిటింగ్ లో ఉండగా, మంజూరైన 24 కొత్త రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టిన SCR, తెలంగాణ నుండి వివిధ నగరాల‌కు మరో మూడు వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-పుణె మధ్య కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

మరి రైల్వే అధికారులు ఆశిస్తున్నది జరుగుతుందా ? తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందా ? లేక ఎప్పటిలాగే కేంద్రం మొండి చేయి చూపిస్తుందా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

First Published:  30 Jan 2023 1:43 AM GMT
Next Story