Telugu Global
Telangana

థర్డ్ ఫ్రంట్ అంటే కేసీఆర్ వెళ్లడం కష్టమే.!

దివంగత ఉప ప్రధాని దేవీలాల్ జయంతి ఉత్సవాలు అని పైకి చెబుతున్నా.. నాన్-బీజేపీ పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటే అసలు లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాను ఏ ఫ్రంట్‌లో చేరనని.. ఫ్రంట్‌ల వల్ల ఒరిగేది ఏమీ ఉండదని మొదటి నుంచి సీఎం కేసీఆర్ చెప్తున్నారు.

థర్డ్ ఫ్రంట్ అంటే కేసీఆర్ వెళ్లడం కష్టమే.!
X

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 25న హర్యానా వెళ్తారా? లేదా? అనే విషయంలో సందిగ్ధ‌త కొనసాగుతూనే ఉంది. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్‌డీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'సమ్మాన్ సమారోహ్' ర్యాలీకి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఓం ప్రకాశ్ చౌతాలా నుంచి ఇప్పటికే యాంటీ-బీజేపీ పార్టీలన్నింటికీ ఇన్విటేషన్లు పంపారు. ములాయం సింగ్ యాదవ్, మమత బెనర్జీ, నితీశ్ కుమార్, హెచ్‌డీ దేవెగౌడ, శరద్ పవార్, ప్రకాశ్ సింగ్ బాదల్ వంటి ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొంటారని చెబుతున్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి, పార్టీ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఈ మీటింగ్‌కు వెళ్తారా లేదా అనే డైలమా కొనసాగుతోంది. అందుకు కారణం.. ఈ ర్యాలీ సమయంలో థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన చేయాలని కొంత మంది నేతలు భావిస్తుండటమే.

దివంగత ఉప ప్రధాని దేవీలాల్ జయంతి ఉత్సవాలు అని పైకి చెబుతున్నా.. నాన్-బీజేపీ పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటే అసలు లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాను ఏ ఫ్రంట్‌లో చేరనని.. ఫ్రంట్‌ల వల్ల ఒరిగేది ఏమీ ఉండదని మొదటి నుంచి సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ ఉన్నా.. దాన్ని రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేసి.. ఓ జాతీయ పార్టీని ఏర్పాటు చేసే పనుల్లో కేసీఆర్ నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే పలువురు జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. రేపు హర్యానా వచ్చే నాయకుల్లో చాలా మందిని గత రెండేళ్లలో కేసీఆర్ పలుమార్లు కలిశారు. జాతీయ పార్టీ ఏర్పాటు ఆవశ్యకతను ఆయా నేతలకు వివరించడమే కాకుండా.. పలు బహిరంగ సభల్లో కూడా కేసీఆర్ వెల్లడించారు. ఈ క్రమంలో మళ్లీ థర్డ్ ఫ్రంట్ అని చెప్తే మాత్రం కేసీఆర్ ఆ దిక్కు కూడా చూడరని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారని.. దసరా నాటికి దానికి సంబంధించిన తుది రూపం వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ పార్టీలో ఎవరు కీలకంగా వ్యవహరించాలనే విషయంలో కూడా ఓ జాబితాను సిద్ధం చేశారు. ఇలాంటి సమయంలో హర్యానా వెళ్లి.. థర్డ్ ఫ్రంట్ చర్చల్లో పాల్గొంటే తప్పుడు సందేశం వెళ్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. కాగా, కేసీఆర్ వెళ్లడం మంచిదనే వ్యాఖ్యలు కూడా కొంత మంది టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. జాతీయ నాయకులంతా కలిసిన చోటకు వెళ్తే కేసీఆర్‌కు కూడా మైలేజీ పెరుగుతుందని.. థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన వాళ్లు చేస్తే కేసీఆర్ తోసిపుచ్చితే సరిపోతుందని వాదిస్తున్నారు. జాతీయ పార్టీ విషయాన్ని మరోసారి వారికి వివరిస్తే థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన కూడా విరమించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా అందిన ఆహ్వానాన్ని తిరస్కరిస్తే.. భవిష్యత్‌లో మళ్లీ వాళ్లతో కలవడంలో ఇబ్బంది ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో పర్యటన విషయంలో నిర్ణయం తీసుకుంటారని.. థర్డ్ ఫ్రంట్‌కు మాత్రం కేసీఆర్ ససేమిరా ఒప్పుకోరనే చర్చ జరుగుతోంది.

First Published:  21 Sep 2022 2:09 AM GMT
Next Story