Telugu Global
Telangana

తెలంగాణలో మోడీ, అమిత్ మ్యాజిక్ చేసేస్తారా..?

రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆపని చేయటంలేదు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. కేసీఆర్ ను తిట్టినంత మాత్రాన బీజేపీ బలోపేతం అవదన్న విషయాన్ని బండి మరచిపోయినట్లున్నారు.

తెలంగాణలో మోడీ, అమిత్ మ్యాజిక్ చేసేస్తారా..?
X

తెలంగాణలో నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డా రెగ్యులర్ గా పర్యటించటం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా..? అవుననే అనుకుంటున్నారు కమలనాధులు. మోడీ, అమిత్ పర్యటించినంత మాత్రాన తెలంగాణాలో పార్టీ ఎలా అధికారంలోకి వచ్చేస్తుందని బీజేపీ నేతలు అనుకుంటున్నారో ఎవరికీ అర్థంకావటంలేదు. గుజరాత్ కు చెందిన వీళ్ళకు తెలంగాణతో ఎలాంటి సంబంధంలేదు. పైగా మోడీ తెలంగాణకు న్యాయంగా దక్కాల్సినవి కూడా దక్కనీయటంలేదు.

తెలంగాణలో మోడీ, అమిత్ ఎన్నిసార్లు పర్యటించినా ఎలాంటి ఉపయోగం ఉండదని అందరికీ తెలుసు. అయినా కొందరు కమలనాధులు 24 గంటలూ అమిత్ షా భజనే చేస్తున్నారు. మోడీ, షా పర్యటనలపైన, భజనలపైన దృష్టిపెట్టేబదులు పార్టీని క్షేత్రస్ధాయిలో బలోపేతం చేయటంపైన పెట్టాలి. అయితే రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆపని చేయటంలేదు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. కేసీఆర్ ను తిట్టినంత మాత్రాన బీజేపీ బలోపేతం అవదన్న విషయాన్ని బండి మరచిపోయినట్లున్నారు.

బీజేపీ క్షేత్రస్ధాయిలో చాలా బలహీనంగా ఉంది. గడచిన రెండు ఎన్నికల్లోను కేవలం మోడీ గాలివల్లే నాలుగు సీట్లొచ్చాయంతే. అప్పటి నుండి సంస్థాగతంగా కానీ, క్షేత్రస్ధాయిలో బలపడేందుకు కానీ, బీజేపీ పెద్దగా దృష్టిపెట్టిందిలేదు. తెలంగాణలో అమిత్ షా రెగ్యులర్ గా పర్యటిస్తే చాలు ఓట్లు పడిపోతాయని అనుకుంటున్నారు. ఇప్పటికి రెండుసార్లు అమిత్ షా పర్యటన వాయిదాపడింది. ఇక నుండి మోడీ, అమిత్, నడ్డాలు రెగ్యులర్ గా తెలంగాణలో పర్యటించబోతున్నారట.

దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వివిధ సమీకరణలు కలిసిరావటం వల్లే బీజేపీ గెలిచిందని అందరికీ తెలుసు. దాన్నే బలుపుగా బీజేపీ ఊహించుకుని రెచ్చిపోతోంది. కాబట్టి మోడీ, అమిత్ ప్రత్యేకంగా దృష్టిపెట్టినా తెలంగాణలో అధికారంలోకి రావటం బీజేపీకి కష్టమే. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో మహా అయితే ఓ 25 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులున్నారంతే. మిగిలిన నియోజకవర్గాల్లో గట్టి నేతలు లేరుకాబట్టే ఇతర పార్టీల నుండి లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగానే పార్టీ బలంగా ఉండుంటే ఇతర పార్టీల నేతలకు గాలమేయాల్సిన అవసరమే బీజేపీకి ఉండేదికాదు. బలమైన పునాది లేనపుడు ఏ నిర్మాణం కూడా నిలబడదన్న విషయం అగ్రనేతలకు అర్థంకావటంలేదు.

First Published:  27 Jan 2023 5:42 AM GMT
Next Story