Telugu Global
Telangana

ఎమ్మెల్యే పదవికి మల్లారెడ్డి రాజీనామా.. ఎంపీగా బరిలోకి..?

గతంలో మల్కాజ్‌గిరి నుంచి ఓ సారి ఎంపీగా గెలిచారు మల్లారెడ్డి. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి.. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బీఆర్ఎస్‌లో చేరిపోయారు.

ఎమ్మెల్యే పదవికి మల్లారెడ్డి రాజీనామా.. ఎంపీగా బరిలోకి..?
X

మాజీ మంత్రి మల్లారెడ్డి త‌న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారా..? అవును.. ఇప్పుడు ఇదే అంశం సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌ మారింది. ఇటీవల జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి వరుసగా రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు మల్లారెడ్డి. మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానం నుంచి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సైతం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మల్లారెడ్డి పార్లమెంట్‌కు వెళ్లాలని ఆలోచిస్తున్నారని చర్చ జరుగుతోంది. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని మల్లారెడ్డి ప్రకటించారు కూడా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోనూ మల్లారెడ్డి సమావేశమై ఇదే అంశంపై చర్చించారని ప్రచారం జరుగుతోంది.

గతంలో మల్కాజ్‌గిరి నుంచి ఓ సారి ఎంపీగా గెలిచారు మల్లారెడ్డి. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి.. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి కేబినెట్‌లోనూ చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మల్లారెడ్డి దాదాపు 33 వేలకుపైగా మెజార్టీతో వరుసగా రెండోసారి విజయం సాధించారు.

దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌ పరిధిలోని మేడ్చల్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. దీంతో తన గెలుపు సులువు అవుతుందని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 10 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు.

First Published:  4 Jan 2024 3:54 PM GMT
Next Story