Telugu Global
Telangana

కోమ‌టిరెడ్డి.. బీసీబంధు కాబోతున్నారా?

పార్టీకి మెజార్టీ వ‌స్తే ముఖ్య‌మంత్రి స్థానానికి పోటీప‌డే స్థాయి ఉన్న కోమ‌టిరెడ్డి త‌న సీటును త్యాగం చేస్తాన‌న‌డంలో మ‌త‌ల‌బేంటి? నిజంగానే పార్టీకి బీసీల్లో మైలేజి తీసుకురావ‌డానికేనా? ఇంకేదైనా రాజ‌కీయ వ్యూహం ఉందా..?

కోమ‌టిరెడ్డి.. బీసీబంధు కాబోతున్నారా?
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విధాన నిర్ణ‌యాలు ఎన్నిక‌ల వేళ సీనియ‌ర్ నేత‌ల‌ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఒక కుటుంబానికి ఒక‌టే టికెట్ అని కాంగ్రెస్ అధిష్టానం చేసిన సూచ‌న‌ను తూచా త‌ప్ప‌క పాటిస్తాన‌న్న రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌తో ఇంటికి రెండు టికెట్లు ఆశిస్తున్న నేత‌లు ఇబ్బందిగా ఫీల‌వుతున్నారు. ఎలాగైనా రెండు టికెట్లూ ద‌క్కించుకోవాల‌ని పోటీప‌డుతున్నారు. మ‌రోవైపు ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనూ రెండు అసెంబ్లీ స్థానాల‌ను బీసీల‌కు కేటాయిస్తామ‌ని టీపీసీసీ తీసుకున్న విధాన నిర్ణ‌యం మ‌రో త‌ల‌నొప్పిగా మారింది. ఈ నేప‌థ్యంలో అవ‌స‌ర‌మైతే త‌న సీటును బీసీల కోసం త్యాగం చేస్తాన‌న్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

జానా, ఉత్త‌మ్ కుటుంబాల‌కు రెండేసి

త‌న‌కు హుజూర్‌న‌గ‌ర్‌, త‌న భార్య ప‌ద్మావ‌తికి కోదాడ టికెట్లు కావాల‌ని ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ప‌ట్టుప‌డుతున్నారు. మ‌రోవైపు జానారెడ్డి త‌న కుమారులు ర‌ఘువీర్‌రెడ్డికి మిర్యాల‌గూడ‌, జ‌య‌వీర్‌రెడ్డికి నాగార్జున‌సాగ‌ర్ టికెట్లు కావాల‌ని ఒత్తిడి తెస్తున్నారు. కొడుకుల కోస‌మే తాను పోటీకి రాలేద‌ని కూడా అన్యాప‌దేశంగా చెబుతున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లోనూ, పార్టీ హైక‌మాండ్‌లోనూ జానా, ఉత్త‌మ్‌ల‌కున్నప‌ట్టు.. వార‌డిగిన‌ట్టు రెండేసి సీట్లు తెచ్చిపెట్ట‌బోతుంద‌ని విశ్లేష‌ణ‌లున్నాయి.

మ‌రి బీసీల‌కు ఇచ్చేదెక్క‌డ‌?

అదే ఖాయ‌మైతే న‌ల్గొండ లోక్‌స‌భ స్థానం ప‌రిధిలో హుజూర్‌న‌గ‌ర్‌, కోదాడ‌, మిర్యాల‌గూడ‌, నాగార్జున‌సాగ‌ర్ టికెట్లు రెడ్డి సామాజిక‌వ‌ర్గానికే ద‌క్క‌నున్నాయి. దేవ‌ర‌కొండ ఎస్టీ సీటు. సూర్యాపేట టికెట్ కావాలంటూ దామోద‌ర్‌రెడ్డి, ప‌టేల్ ర‌మేశ్‌రెడ్డి ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మిగిలిన ఏకైక అసెంబ్లీ సీటు న‌ల్గొండ‌. బీసీలకు ఇవ్వాల‌న్నా మిగిలింది అదొక్క‌టే. అందుకే త‌న సీటును అవ‌స‌ర‌మైతే బీసీల‌కు ఇస్తాన‌ని నాలుగుసార్లు అక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా, ప్ర‌స్తుతం ఎంపీగా గెలిచిన కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్ర‌క‌టించారు. పార్టీకి మెజార్టీ వ‌స్తే ముఖ్య‌మంత్రి స్థానానికి పోటీప‌డే స్థాయి ఉన్న కోమ‌టిరెడ్డి త‌న సీటును త్యాగం చేస్తాన‌న‌డంలో మ‌త‌ల‌బేంటి? నిజంగానే పార్టీకి బీసీల్లో మైలేజి తీసుకురావ‌డానికేనా? ఇంకేదైనా రాజ‌కీయ వ్యూహం ఉందా అనే విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి.

*

First Published:  31 Aug 2023 5:50 AM GMT
Next Story