Telugu Global
Telangana

నేను కూడా సీఎం అవుతా.. జగ్గారెడ్డి కామెంట్స్ వైరల్

సంగారెడ్డిలో సోమవారం దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు

నేను కూడా సీఎం అవుతా.. జగ్గారెడ్డి కామెంట్స్ వైరల్
X

తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడే నేతలు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తాము సీఎం పదవి రేసులో ఉన్నామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు అని.. ఏదో ఒక రోజు నేను కూడా ముఖ్యమంత్రిని అవుతానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కావాలన్న కోరికను ఆయన పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు.

ప్రజలు ఆశీర్వదిస్తే తాను కూడా సీఎం రేసులో ఉంటానని, అందులో తప్పేమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గతంలో వ్యాఖ్యానించారు. ఇక కొద్ది రోజుల కిందట సీఎం పదవి తనను కోరుకుంటోందని మరో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో మరో సీనియర్ నేత చేరారు. సంగారెడ్డిలో సోమవారం దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతానని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇలాగే ఆశీర్వదిస్తుంటే ఇంకో పదేళ్లకు తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అయ్యి తీరుతానన్నారు. విజయ దశమి రోజు తన మనసులోని మాటను బయటపెట్టానన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని లేకపోతే మరిన్ని విషయాలు చెప్పేవాడినని జగ్గారెడ్డి అన్నారు.

అదృష్టం తలుపు తట్టాలే కానీ, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి ఎవరినైనా వరించే అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు సందర్భాల్లో ఎవరు ఊహించని వ్యక్తులు ముఖ్యమంత్రి పదవి అధిష్టించారు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు తమకు ముఖ్యమంత్రి పదవి వరిస్తుందన్న ఆశతో ఉన్నారు.

First Published:  24 Oct 2023 2:56 AM GMT
Next Story