Telugu Global
Telangana

ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష‌ కొన‌సాగనుందా ?

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు తొమ్మిది కేంద్ర బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. అయితే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా వివిధ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను పట్టించుకోలేదు.

ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష‌ కొన‌సాగనుందా ?
X

గత కొన్ని సంవత్సరాలుగా, కేంద్ర బడ్జెట్ తెలంగాణపై వివక్షనే కొనసాగిస్తోంది. తెలంగాణ ప్రజలకు నిరాశనే మిగులుస్తోంది.

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు తొమ్మిది కేంద్ర బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. అయితే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా వివిధ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను పట్టించుకోలేదు.

2022-23 కేంద్ర బడ్జెట్‌కు ముందు కూడా, AP పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఇచ్చిన హామీలతో సహా దాదాపు 35 అంశాలకు సంబంధించిన అభ్యర్థనలను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎప్పటిలాగే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.

పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిపై కేంద్రం ఉదాసీనత కారణంగా తెలంగాణ ఆశలు నీరుగారిపోయాయి.

గత తొమ్మిదేళ్లలో, రాష్ట్రం కోరిన ఐఐఎం, ఎన్‌ఐడి, ఐఐఎస్‌ఇఆర్, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలతో సహా జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఏ ప్రధాన విద్యా సంస్థలను కూడా కేంద్రం మంజూరు చేయలేదు.

ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్, హైదరాబాద్ ఫార్మా సిటీ, మెగా హ్యాండ్లూమ్/పవర్లూమ్ క్లస్టర్, మెగా టెక్స్‌టైల్ పార్క్, ఇతర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల కు బడ్జెట్ మద్దతు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన‌ అభ్యర్థనలు కేంద్రం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్, ఇతర రాష్ట్రాలకు ఉపయోగపడే హైవే విస్తరణ/కనెక్టివిటీ ప్రాజెక్టులు మినహా, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు ఏవీ కేంద్రం ఆమోదించలేదు.

GST పరిహారం, IGST సెటిల్‌మెంట్ బకాయిల విడుదల కోసం తెలంగాణ చేసిన అభ్యర్థనలపై కేంద్రం స్పందించలేదు. GST పరిహారం, IGST సెటిల్‌మెంట్‌కు సంబంధించిన బకాయిల విడుదలతో సహా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రూ.10,000 కోట్ల పైగా నిధులను కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేయలేదు.

పన్నుల పంపిణీలో తగ్గుదల వల్ల‌ గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ రాష్ట్రానికి ఇంకా అందలేదు.

2014-15లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి తెలంగాణకు విడుదల చేయాల్సిన రూ.495 కోట్ల బకాయిలను పొరపాటుగా ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసిన కేంద్రం ఇప్పటి వరకు తిరిగి తెలంగాణకు ఇవ్వలేదు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సి ఉన్న విద్యుత్ బకాయిలపై కూడా ఎలాంటి చర్యలు లేవు.

కానీ, ఆంధ్రప్రదేశ్‌కు తెలంగణా ఇవ్వాల్సిన‌ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది, అలా చేయని పక్షంలో రాష్ట్రంపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం వెనుకబడిన జిల్లాలకు రూ.900 కోట్ల ప్రత్యేక సాయం కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు.

ఎన్నిసార్లు అభ్యర్థిస్తున్నప్పటికీ గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి సంబంధించిన అంశాన్ని కేంద్రం పట్టించుకోవడంలేదు.

నదుల అనుసంధాన ప్రాజెక్టులు చేపట్టకముందే తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణానదీ జలాల వివాదాన్ని పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతున్నప్పటికీ కేంద్రం మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.

తెలంగాణ ఏర్పాటైన నాటి నుండీ ప్రతి బడ్జెట్ లో రాష్ట్రం పై వివక్ష చూపిస్తున్న కేంద్రం కనీసం రాబోయే బడ్జెట్ లోనైనా ఏమైనా భిన్నంగా ఉంటుందా లేదా అనేది చూడాలి.

First Published:  26 Jan 2023 2:32 AM GMT
Next Story