Telugu Global
Telangana

దసరాకు సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్‌లో అడుగు పెట్టనున్నారా?

ఆధునిక సౌకర్యాలతో, పూర్తి వాస్తుకు అనుగుణంగా సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే అన్ని అంత‌స్థులు పూర్తి కాకపోయినా.. సీఎం కోసం సిద్ధం చేసిన 6వ ఫ్లోర్ పనులు మాత్రం యుద్ధ‌ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.

దసరాకు సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్‌లో అడుగు పెట్టనున్నారా?
X

తెలంగాణ సచివాలయం త్వరలోనే ప్రారంభం కానున్నది. సీఎం కేసీఆర్ మొదటిగా ఈ సచివాలయంలో ప్రవేశించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సచివాలయంలోకి వెళ్లలేదనే విమర్శలను మూటగట్టుకున్న కేసీఆర్.. దసరాకు కొత్త సెక్రటేరియట్‌లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తుంది. పాత సచివాలయాన్ని కూలగొట్టి.. అక్కడే అత్యంత ఆధునిక సౌకర్యాలతో, పూర్తి వాస్తుకు అనుగుణంగా సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే అన్ని అంత‌స్థులు పూర్తి కాకపోయినా.. సీఎం కోసం సిద్ధం చేసిన 6వ ఫ్లోర్ పనులు మాత్రం యుద్ధ‌ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌కు '6' నెంబర్ చాలా లక్కీగా భావిస్తుంటారు. ఆయన ఆ అంకెను చాలా సెంటిమెంట్‌గా చూస్తారు. ఈ క్రమంలో సచివాలయంలో కూడా ఆరో ఫ్లోర్‌లో వాస్తుకు అనుగుణంగా సీఎం ఛాంబర్‌ను నిర్మిస్తున్నారు. ఆ ఫ్లోర్ పూర్తిగా సీఎం, సంబంధిత అధికారులకు కేటాయించారు. కేసీఆర్‌కు సన్నిహితులైన సిద్ధాంతి సూచనల మేరకు దసరాకు ఈ ఫ్లోర్ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిసిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికతో సహా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారని చెప్తున్నారు. వాస్తవానికి అన్ని శాఖలను ఒకేసారి తరలించేలా మొదట ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే నిర్మాణం పూర్తవడానికి మరింత సమయం పడుతుండటం.. దసరా తర్వాత మంచి రోజులు లేవనే కారణంతో.. ముందుగా సీఎం కొత్త సచివాలయంలోకి అడుగు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

దసరా రోజు ఆరో ఫ్లోర్ ప్రారంభిస్తే మంచిదని కేసీఆర్‌కు సూచించడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఒకవైపు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛాంబర్ ప్రారంభించిన తర్వాత ముందస్తుకు వెళితే కలసి వస్తుందని సిద్ధాంతులు సూచించడంతోనే కేసీఆర్ ఓకే చెప్పినట్లు తెలుస్తున్నది. సీఎం ఛాంబర్‌తో పాటు ఆర్థిక శాఖ, జేఏడీ శాఖలను ముందుగా కొత్త సెక్రటేరియట్‌కు తరలించనున్నారు. కొత్త సచివాలయంలోని 2వ ఫ్లోర్ మొత్తం ఆర్థిక శాఖకు కేటాయించారు. ఈ ఫ్లోర్‌లో పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి.

పాత సెక్రటేరియట్ భవనాన్ని కూలగొట్టి 20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 9 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ఇంటిగ్రేటెట్ సెక్రటేరియట్ పనులు ఛాన్నాళ్ల క్రితం ప్రారంభించారు. ఈ భవనంలో 1008 దర్వాజాలు, 465 కిటికీలు ఉండేటా ప్లాన్ చేశారు. దీని వల్ల లోపలకు గాలి, వెలుతురు పుష్కలంగా వస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు. దాదాపు రూ. 600కోట్ల వ్యయం అవుతుండగా.. సెక్రటేరియట్ కాంపౌండ్‌లో ఓ గుడి, చర్చి, మసీదు కూడా నిర్మిస్తున్నారు.

First Published:  1 Sep 2022 2:53 AM GMT
Next Story