Telugu Global
Telangana

కేసీఆర్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారా? దసరాకు జాతీయ పార్టీ ప్రకటన.!

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత డిసెంబర్‌లో జాతీయ పార్టీని ప్రకటించాలని భావించారు. కానీ, తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనించిన కేసీఆర్.. దసరాకు పార్టీని ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

కేసీఆర్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారా? దసరాకు జాతీయ పార్టీ ప్రకటన.!
X

జాతీయ పార్టీ ప్రకటనపై సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నారా? మరింత ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారా? పార్టీ ప్రకటనకు అక్టోబరే సరైన సమయం అనే నిర్ణయానికి వచ్చారా? అంటే టీఆర్ఎస్ వర్గాల నుంచి అవుననే సమాచారమే వస్తోంది. కేంద్రంలో బీజేపీయేతర సర్కారు రావాలని, రైతు ప్రభుత్వం ఉండాలని గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ బహిరంగంగానే ప్రకటనలు చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ఇప్పటికే చెప్పేశారు. అయితే ఫ్రంట్‌ల వల్ల ఎలాంటి ఫైదా ఉండదని.. జాతీయ పార్టీనే ఇందుకు సరైన వేదిక అవుతుందని కేసీఆర్ చెప్తున్నారు. టీఆర్ఎస్‌ నుంచే జాతీయ పార్టీ ఆవిర్భవిస్తుందని కూడా అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలోనే ఇందుకు సంబంధించిన లీకులు ఇచ్చారు. గత కొంత కాలంగా జాతీయ స్థాయి నాయకులను కూడా కలుస్తూ.. పార్టీ ఎలా ఉండాలనే విషయాలపై చర్చించారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత డిసెంబర్‌లో జాతీయ పార్టీని ప్రకటించాలని భావించారు. కానీ, తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనించిన కేసీఆర్.. దసరాకు పార్టీని ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

హర్యానాలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నాయకులు కాంగ్రెస్‌తో కలిసి ప్రధాన ఫ్రంట్‌ ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రకటన చేశారు. అయితే మొదటి నుంచి ఫ్రంట్ వద్దు, కాంగ్రెస్‌తో కలవొద్దు అనే నియమానికే కట్టుబడి ఉన్న కేసీఆర్.. ఇక పార్టీ ప్రకటన చేయక తప్పదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. చెడుపై మంచి గెలిచిన రోజును విజయదశమిగా జరుపుకుంటారు. హిందువులకు ఆ రోజు చాలా ముఖ్యమైనది. అంతే కాకుండా ఆయుధ పూజ కూడా చేసి కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తుంటారు. అదే రోజు కొత్త పార్టీని ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.కేంద్రంలోని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై పోరాటానికి బీఆర్ఎస్ అనే ఆయుధాన్ని కేసీఆర్ సిద్ధం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.

జాతీయ పార్టీ ప్రకటన అక్టోబర్ 5న చేయనున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ మనుగడ ఉండబోదని తెలుస్తున్నది. టీఆర్ఎస్‌కు చెందిన కారు గుర్తు, గులాబీ రంగు, పార్టీ జెండానే బీఆర్ఎస్ పార్టీ కొనసాగించనున్నట్లు సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరు మీదనే పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ సింబల్ ఎలాగో కారు గుర్తుగానే ఉండనున్నది. కాబట్టి పెద్దగా నష్టం కూడా ఉండదని భావిస్తున్నారు. 2001లో ఎలాగైతే టీఆర్ఎస్ పార్టీని పెట్టి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారో.. అదే స్పూర్తితో బీఆర్ఎస్‌ను ప్రారంభించాలని.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓ ఉద్యమాన్ని నడిపించాలని కేసీఆర్ నిర్ణయించారు. అప్పటి తెలంగాణ ఉద్యమ స్పూర్తిని కొనసాగించాలని కేసీఆర్ చెబుతున్నారు.

బీజేపీయేతర పార్టీలను కలుపుకొని పోయి కేంద్రంలో రైతు ప్రభుత్వాన్ని తీసుకొని రావాలనే ఉద్దేశంతో గత కొన్ని నెలలుగా అనేక మంది జాతీయ నాయకులను కేసీఆర్ కలిశారు. స్వయంగా వారి వద్దకే వెళ్లి బీజేపీపై పోరాటం ఎలా చేయాలనే విషయాలను చర్చించారు. అయితే, చాలా మంది ఫ్రంట్‌కే మొగ్గు చూపారు తప్ప బీజేపీపై ప్రత్యక్ష పోరాట విషయంలో స్పష్టత కనపరచలేదు. దీంతో ఇక తానే స్వయంగా రంగంలోకి దిగి బీజేపీని ఎదుర్కోవాలని.. భవిష్యత్‌లో ఎవరైనా ఆసక్తి చూపిస్తే తప్పకుండా కలసి పని చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోనే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేయడానికి బీఆర్ఎస్‌ను సిద్ధం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు. కనీసం 150 నుంచి 170 సీట్లలో బీఆర్ఎస్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, బీహార్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, పంజాబ్, యూపీలో బీఆర్ఎస్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

2024లో బీఆర్ఎస్ పార్టీకి తగినన్ని ఓట్లు లభిస్తాయని, ఆ ఎన్నికల తర్వాత జాతీయ పార్టీకి అవసరమైన గుర్తింపు వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీనే తర్వాత ప్రధాని ఎవరనే విషయాన్ని నిర్ణయిస్తుందని.. ఆ మేరకు సీట్లు సంపాదిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ తరపున ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అభ్యర్థులను నిలబెట్టరని తెలుస్తున్నది. పార్టీ ప్రకటన తర్వాత లక్నో, పాట్నా, ఢిల్లీలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉన్నది. గత 12 నెలలుగా జాతీయ పార్టీ కోసం చేసిన అధ్యయనం, చర్చలు చివరకు అక్టోబర్ 5న కార్యరూపం దాల్చనున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  27 Sep 2022 2:05 AM GMT
Next Story