Telugu Global
Telangana

అమిత్ షా బాణం - అర్థం లేని యాత్ర!!

'తెలంగాణ కోడలు'నంటూ తెగ గింజుకుంటున్న షర్మిలకు అన్న ఆంధ్రా నుండి తరిమేసే దాకా తెలంగాణ కోడలునన్న విషయం గుర్తుకురాలేదు. వైఎస్ఆర్ భార్య విజయమ్మ కూడా గుడ్డిగా బిడ్డ వెనక తిరుగుతూ రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాజ్యం మాదే అన్నట్లు కలలుకంటున్నారు.

అమిత్ షా బాణం - అర్థం లేని యాత్ర!!
X

"కేసీఆర్ కు ఎన్నికలతోనే పని. ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తాడు. గాడిదకు రంగు పూస్తడు.. ఇదే ఆవు అని నమ్మిస్తాడు. ఓట్లు వేయించుకొని దొర మళ్ళీ ఫామ్ హౌజ్ కి పోతాడు. మళ్ళీ తిరిగి ప్రజల వైపు చూడడు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న. ఏరు దాటినాక బోడి మల్లన్న. ఈ సారి కేసీఆర్ కు బుద్ది చెప్పాలి. వైఎస్సార్ సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ. వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా" అని షర్మిలక్క గురువారం మంచిర్యాల జిల్లా జైనూరు దగ్గర అన్నారు. పరాయి రాష్ట్రంలో ఆమె కిరాయి యాత్ర ఏమిటో ఇప్పటిదాకా అంతుచిక్కడం లేదు.

'రాజన్నొచ్చినాడు రాజన్న కొడుకు రాంబ్రహ్మమొచ్చినాడు ఒక్కసారొచ్చి పోమ్మా మెరుపు తీగ' అని ఒక సినిమాలో సన్నివేశం ఉంటుంది.

ఆస్తుల పంచాయితీ తేల్చుకోలేక అన్న మీద అలిగి ఆంధ్రప్రదేశ్ విడిచి తెలంగాణ మీద పడ్డ వైఎస్ షర్మిల తెలంగాణలో వేస్తున్న అరుపులు, కేకలు, శాపనార్థాలు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. మంత్రులూ, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులపై ఆమె దుమ్మెత్తిపోస్తున్నారు. 'అర్జంటుగా నాకు ఓట్లేయండి. ముఖ్యమంత్రిని చేసేయండి. నాకు అధికారం ఇస్తే చందమామను నేల మీదకు దించుతా. సూర్యుడి వేడి భూమికి తగలకుండా పందిళ్లు వేయిస్తా. నొప్పులు లేకుండా కాన్పులు చేయిస్తా. కష్టం చేయకుండానే కడుపు నిండ బువ్వ పెడతా' అని ఆమె అంటున్నది.నాది గాకుంటే ఢిల్లీ దాకా డేక్కుంటా పోతా అన్నట్లుంది వైఎస్ షర్మిల వ్యవహారం.

42 మంది తెలంగాణ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించి 2004లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని 30 ఏండ్ల ముఖ్యమంత్రి పీఠం కలను వైఎస్ఆర్ నెరవేర్చుకున్న సంగతి షర్మిల కు తెలుసా..? ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఆంధ్రా, సీమ సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేసి తెలంగాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పెండింగ్ లో పెట్టిన విషయం వైఎస్ పుత్రికకు తెలిసి ఉండక పోవచ్చు. 11 వేల క్యూసెక్కుల సామర్థ్యం గల పోతిరెడ్డిపాడును 55 వేల క్యూసెక్కులకు పెంచి పాలమూరు రైతుల నోట్లో మన్నుకొట్టినందుకు షర్మిల జవాబు చెప్పాలి.

తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి నీళ్లు తెచ్చే పంపుహౌస్, సర్జ్ పూల్ ల నిర్మాణం గాలికి వదిలేసి రిజర్వాయర్లను కట్టి కాలువలు తవ్వి గాలికి వదిలేశారు. వైఎస్ హయాంలో అసంపూర్తిగా తవ్వి వదిలేసిన కాలువలు ఇప్పటికీ దర్శనం ఇస్తాయి. సర్కారు ఇచ్చిన బంజారాహిల్స్ ఇల్లు అమ్మకానికి వైఎస్ఆర్ ద‌రఖాస్తు చేసుకోలేదా..? మరి ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబ ఆస్తులు ఎన్ని..? తెలంగాణ పుణ్యాన ముఖ్యమంత్రి అయిన వైఎస్ ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలు ముగియగానే నంద్యాల గడ్డ మీద "తెలంగాణకు వెళ్లాలంటే మనం వీసా, పాస్ పోర్ట్ తీసుకోవాలా "? అని తన నిజ స్వరూపం చాటుకున్న వ్యక్తి వైఎస్. టీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను చీల్చి తెలంగాణవాదం గొంతు నులిమి వేయాలని ప్రయత్నించాడు.

వైఎస్ ఆకస్మిక మరణంతో ప్రజలు ఆయన చెడును వదిలేసి మంచిని మాత్రమే చూశారు. వైఎస్ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన కుటుంబం ఊరూరా విగ్రహాలు పెట్టి దేవుడిని చేశారు. వైఎస్ పాలనలో సాగునీటి రంగంలో జరిగిన లాభం కన్నా కలిగిన నష్టమే ఎక్కువ. అలాంటి వైఎస్ గురించి తెలంగాణ మరిచిపోయిందనుకొని పాదయాత్ర పేరుతో దండయాత్ర చేయాలనుకోవడం షర్మిల అవివేకం. అజ్ఞానం.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు పాదయాత్ర చేసిన ఈ 'జగనన్న విడిచిన బాణం ' అలంపూరు చౌరస్తాలో వాళ్లమ్మ విజయమ్మతో కలిసి తెలంగాణ ఇస్తే తమకు అభ్యంతరం లేదని చిలుక పలుకలు పలికింది. కేంద్రం నుంచి తెలంగాణ ప్రకటన రాగానే ఆంధ్రాలో యాత్రలు చేస్తూ తెలంగాణ పాకిస్తాన్ అంటూ షర్మిలక్క విషం కక్కింది. '

'తెలంగాణ కోడలు'నంటూ తెగ గింజుకుంటున్న షర్మిలకు అన్న ఆంధ్రా నుండి తరిమేసే దాకా తెలంగాణ కోడలునన్న విషయం గుర్తుకురాలేదు. వైఎస్ఆర్ భార్య విజయమ్మ కూడా గుడ్డిగా బిడ్డ వెనక తిరుగుతూ రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాజ్యం మాదే అన్నట్లు కలలుకంటున్నారు. సొమ్ము గంప కింద గట్టిగా ఉండడంతో వైఎస్ షర్మిల నిలకడగా ఉండలేక ఆకాశానికి నిచ్చెన వేసి ఎండమావుల వెంటపడి పాదయాత్రలు చేస్తున్నది. తనను తాను ఎక్కువగా ఊహించుకుని స్థాయిని మరిచి మాట్లాడుతుంది. చైతన్యవంతమైన తెలంగాణ నేలకు ఎవరి చెవులు, ముక్కు ఎప్పుడు కోయాలో స్పష్టంగా తెలుసు.

రాజకీయ పదవులు ఆశించకుండా 14 ఏండ్లు పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి, ఎనిమిదేళ్లలోనే రాష్ట్రాన్ని దేశంలోని అగ్రశ్రేణి రాష్ట్రాల సరసన నిలిపిన కేసీఆర్ ఎక్కడ..? అందివచ్చిన అవకాశంతో అడ్డగోలుగా వేల కోట్లు సంపాదించి రాజకీయం చేయాలని తహతహలాడుతున్న వైఎస్ షర్మిల ఎక్కడ..? ఈ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారుల కాలిగోటికి కూడా సరితూగలేని షర్మిల ఇక్కడ రాజకీయం చేయాలనుకోవడం విడ్డూరం.

షర్మిల పాదయాత్ర ఒక్క రోజు ఖర్చు రూ.25 లక్షల నుండి రూ.30 లక్షలనీ ఒక అంచనా. షర్మిలతో పాటు వేళ్ల మీద లెక్కపెట్టే ఒకరిద్దరు మినహా వెంట ఉండి టెంటు వేసి, ముందు వెళ్లి ఆటోలో షర్మిల వస్తున్నారని ప్రచారం చేసి, దారిపొడవునా జెండాలు కట్టి, ఫ్లెక్సీలు పెట్టి, సభకు అక్కొస్తుందని పాటలు పాడే కళాకారుల బృందంతో పాటు రూ.300 ఇచ్చి సభలకు తీసుకొచ్చుకుంటున్న జనం వరకు ప్రతి ఒక్కటీ షర్మిల పైసలు పెట్టి కొంటున్నదే. ఖమ్మం జిల్లా నుంచి రప్పించిన దాదాపు 400 మంది యువకులకు రోజుకు రూ.వెయ్యి వేతనం లభిస్తున్నట్టు తెలుస్తోంది. పాదయాత్రలో రోడ్డు మీద పోతుంటే బర్లు, గొర్లు కాసే వారిని, రోడ్డెంట పోయేవారిని ఆపి షర్మిల వద్దకు తీసుకొచ్చి ఫొటోలు దింపడం, షర్మిల సమావేశాలు, సభలలో నలుదిక్కులా స్ప్రెడ్ అయి షర్మిల అడిగే అన్నింటికీ అవును, అవును అంటూ చెప్పడం. వైఎస్ , షర్మిల పేర్లతో నినాదాలు చేయడం వీరి పని.

మొత్తం పాదయాత్ర పూర్తిగా కాసుల యాత్ర. అన్నతో పడని చెల్లెలు అయ్య సొమ్ముతో అధికారం కోసం ఆరాటపడుతున్న ఓ బిడ్డ చేస్తున్న 'అసమర్థ జీవి యాత్ర' ఇది. తెలంగాణ సమాజ చైతన్యాన్ని తక్కువగా అంచనా వేస్తూ సాగుతున్న అవివేకపు యాత్ర. పరాయి రాష్ట్రానికి వచ్చి కిరాయి యాత్రలు చేస్తున్న షర్మిల వెనక ఉన్నది ఎవరో తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణ చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వారంతా చరిత్ర పుటల్లో కలిసిపోయారు.

ఆమె 'అమిత్ షా విడిచిన బాణం' అని పలు సందర్భాల్లో రుజువయ్యింది. ఢిల్లీకి రాకపోకలు సాగిస్తూ ఈడీ, సీబీఐలను కలిసి కేసీఆర్ పైన, టిఆర్‌ఎస్ ప్రభుత్వంపైన ఫిర్యాదు చేయడం వెనుక స్క్రీన్ ప్లే ఎవరిదో అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు అమాయకులు, సహృదయులు, నిష్కల్మష మనుషులు కనుక షర్మిల పాదయాత్రకు ఎక్కడా అడ్డంకులు సృష్టించడం లేదు. అయితే ఇదంతా ఒక పరిమితి వరకే. షర్మిల ఇలా రెచ్చిపోతూ ఉంటే ఏదో ఒక రోజు ప్రజలే ఆమెను ప్రతిఘటించవలసి రావచ్చు.

First Published:  12 Nov 2022 1:30 AM GMT
Next Story