Telugu Global
Telangana

తమ్ముడికి ఓటు వేయడానికే వెంకట్ రెడ్డి తిరిగొచ్చారా..?

భారత్ జోడో యాత్రలో వెంకట్ రెడ్డి పాల్గొంటారని కొంతమంది చెబుతున్నారు. అయితే షోకాజ్ నోటీసుకి సమాధానం ఇవ్వకుండా ఆయన యాత్రలో పాల్గొనేందుకు పార్టీ ఒప్పుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

తమ్ముడికి ఓటు వేయడానికే వెంకట్ రెడ్డి తిరిగొచ్చారా..?
X

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల మరుససటి రోజే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్ట్రేలియాకు పయనమవుతున్న వేళ.. ఆయ సోదరుడు వెంకట్ రెడ్డి నేరుగా ఆస్ట్రేలియానుంచి నల్లగొండకు రావడం సంచలనంగా మారింది. తమ్ముడికి ఓటు వేసేందుకే ఆయన ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చారంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అయితే ఆయన పోల్ మేనేజ్ మెంట్ కోసమే నేరుగా నల్లగొండలో అడుగు పెట్టారని, తమ్ముడికి తన తరపున కాసిన్ని ఓట్లు వేయించందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు మరికొంతమంది. మునుగోడులో ఓటమి ఖాయమైన వేళ, కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రాంగాలు దేనికీ పనికి రావు అని అంటున్నారు స్థానిక నాయకులు.

కాంగ్రెస్ కి సమాధానం చెబుతారా..?

రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలంటూ ఇటీవల వెంకట్ రెడ్డి మాటల ఆడియో రికార్డింగ్ లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం వెంకట్ రెడ్డి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు పంపించింది. దానికి ఇంతవరకు వెంకట్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఇండియాకి వచ్చారు కాబట్టి, కాంగ్రెస్ కి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి పార్టీ వర్గాలు.

జోడో యాత్రలో పాల్గొంటారా..?

ప్రస్తుతం తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో వెంకట్ రెడ్డి పాల్గొంటారని కొంతమంది చెబుతున్నారు. అయితే షోకాజ్ నోటీసుకి సమాధానం ఇవ్వకుండా ఆయన యాత్రలో పాల్గొనేందుకు పార్టీ ఒప్పుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద మునుగోడులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వెంకట్ రెడ్డి పార్టీని వీడేంత సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన రాజగోపాల్ రెడ్డి 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు కానీ, రాజకీయ జీవితంపై మాయని మచ్చ వేసుకున్నారు. వెంకట్ రెడ్డి కూడా ఆ తప్పు చేస్తారా, లేదా చేసిన తప్పుకి సంజాయిషీ ఇచ్చి కాంగ్రెస్ లోనే కొనసాగుతారా.. ? వేచి చూడాలి.

First Published:  2 Nov 2022 11:02 AM GMT
Next Story