Telugu Global
Telangana

బీజేపీలో ఎందుకీ వింత పరిస్థితి?

తెలంగాణలోని బీజేపీ సీనియర్లు అసెంబ్లీ ఎన్నికలు అంటేనే భయపడుతున్నారు.

బీజేపీలో ఎందుకీ వింత పరిస్థితి?
X

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. దేశంలోనే ప్రస్తుతం అత్యంత బలమైన పార్టీగా గుర్తింపు.. ఉత్తరాదిలో చక్రం తిప్పుతున్న పార్టీ.. అయినా సరే తెలంగాణకు వచ్చే సరికి పూర్తిగా చతికిలపడిపోయింది. అదే బీజేపీ పార్టీ. తెలంగాణలో ఒకానొక సమయంలో బీజేపీ అత్యంత దూకుడుగా వ్యవహరించింది. బీఆర్ఎస్‌ను ఓడించి తామే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం చేపడతామని ఎన్నో వేదికలపై బీజేపీ నాయకులు ప్రకటించారు. కేసీఆర్‌ను గద్దె దించే సత్తా బీజేపీకి మాత్రమే ఉన్నదని ధీమాగా చెప్పారు. తీరా ఎన్నికల సమయానికి అలాంటి ప్రకటనలు చేసిన వాళ్లు కూడా సైలెంట్ అయిపోయారు.

తెలంగాణలోని బీజేపీ సీనియర్లు అసెంబ్లీ ఎన్నికలు అంటేనే భయపడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఎన్నికల్లో ముందుండి నడిపించాలి. ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయాలి. కానీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. డీకే అరుణ కూడా తన సీటును బీసీలకు త్యాగం చేశారని చెప్పుకొచ్చారు. కానీ, గెలుపుపై నమ్మకం లేకనే ఆమె పోటీకి దూరంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పిన బీజేపీ నాయకులు.. ఇప్పుడు ఎన్నికల బరిలో కూడా లేరు. సూపర్-30 పేరుతో ముందే లిస్టు విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీలు కూడా ఈ లిస్టులో ఉంటారని చెప్పారు. తీరా టికెట్ల కేటాయింపు దగ్గరకు వచ్చే సరికి పోటీకి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. బీజేపీ పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందంటే.. తనకు టికెట్ కేటాయించవద్దని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన బాబూమోహన్‌కే ఆందోల్ టికెట్ కట్టబెట్టింది. దేశంలోనే బలమైన పార్టీకి తెలంగాణలో ఉన్న వింత పరిస్థితికి నిదర్శనం ఇది.

కిషన్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, ఎంపీ లక్ష్మణ్ వంటి నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉన్నారనే ప్రశ్నకు అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి. మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే.. అది రాబోయే లోక్‌సభ ఎన్నికలపై పడుతుందనే భయం ఆయా నాయకుల్లో నెలకొన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలో ఎలాగూ అధికారంలోకి వచ్చేది లేదు. అదే లోక్‌సభకు పోటీ చేసి గెలిస్తే.. కేంద్రంలో మంత్రి పదవైనా వస్తుందనే ఆశతో పార్టీలోని సీనియర్లు ఉన్నట్లు తెలిసింది.

బీజేపీ సీనియర్ల ఈ వ్యవహార శైలి కారణంగా రాష్ట్రంలోని క్యాడర్ అంతా డీలా పడిపోయింది. బీజేపీలో ఎక్కడ కూడా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు లేవు. ఇప్పటికీ ఒక మేనిఫెస్టో లేదు. మొన్న కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చి బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అనే ఒక ప్రకటన తప్ప.. తెలంగాణ ఎన్నికల బరిలో మేమూ ఉన్నామనే విధంగా పార్టీ కార్యక్రమాలు లేవు. దీంతో క్యాడర్ కూడా ముందే ఓటమిని అంగీకరించి.. సైలెంట్ అయిపోయారు.

First Published:  3 Nov 2023 3:14 AM GMT
Next Story