Telugu Global
Telangana

ఎప్పుడో ప్రారంభమైన ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మళ్ళీ ఇప్పుడు ప్రారంభిస్తాడట !

2021మార్చ్ 23 న ఎరువుల ఉత్పత్తి ప్రారంభించి, ఇప్పటికి పది లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి చేసిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మళ్ళీ ఈ నెల 12న ప్రారంభిస్తున్నారు. దీని వెనక రాజకీయ కారణాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎప్పుడో  ప్రారంభమైన ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మళ్ళీ ఇప్పుడు ప్రారంభిస్తాడట !
X

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించడానికి ఈ నెల 12న ప్రధాని మోడీ రానున్నారు. మోడీ రాక సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు. మునుగోడులో ఓడిపోయి, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా బుక్కై, నైతికంగా పతనమై, స్థైర్యం కోల్పోయిన‌ కార్యకర్తలకు బూస్ట్ ఇవ్వ‌డానికి మోడీ పర్యటనను ఉపయోగించుకోవాలని తపన పడుతున్నారు బీజేపీ నాయకులు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం తర్వాత మోడీ రామగుండంలో బీజేపీ ఏర్పాటు చేస్తున్న బహిరంగసభలో పాల్గొంటారు. అది పూర్తిగా రాజకీయ సభ. ఇప్పటికే తెలంగాణలో చావుతప్పి కన్నులొట్టపోయిన పరిస్థితిలో ఉన్న బీజేపీకి మోడీ ఆ సభద్వారా ఏం ఊపిర్లు ఊదుతారో చూడాలి.

Advertisement

అయితే ఈ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రధాని ప్రారంభించడమనేదే పెద్ద ప్రహసనం. ఎప్పుడో ప్రారంభమై ఉత్పత్తి కూడా మొదలుపెట్టిన ఫ్యాక్టరీకి ఇప్పుడు ప్రారంభకార్యక్ర‌మం జరపడం వెనక‌ ఉన్న అసలు ఉద్దేశాలు ఏంటనే దానిపై ప్రస్తుతం తెలంగాణలో చర్చ జరుగుతోంది.

నిజానికి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) 17 ఫిబ్రవరి, 2015న స్థాపించబడింది. అందులో తెలంగాణ ప్రభుత్వానికి 11 శాతం ఈక్విటీ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అద్వర్యంలో నడిచే ఈ ఫ్యాక్టరీకి కావలసిన మౌలిక వసతులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చింది.

Advertisement

వాణిజ్యపరంగా ఈ ఫ్యాక్టరీ 2021మార్చ్ 23 న ఉత్పత్తి ప్రారంభించింది. అంటే ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభమై ఒక సంవత్సరం ఏడునెలలుకు పైగా అయ్యింది. ఇప్పటికే పది లక్షల టన్నులకు పైగా ఎరువుల ఉత్పత్తి, సరఫరా కూడా జరిగిపోయింది. మరి ప్రధాని ఇప్పుడు ప్రారంభించడం, జాతికి అంకితం చేయడమనే ప్రహసనాన్ని ఎందుకు సాగిస్తున్నట్టు ? పైగా దాదాపు రెండు నెలలుగా ఈ కంపెనీకి రిపేర్లు రావడం వల్ల ఉత్పత్తి ఆగిపోయింది. వాస్తవానికి ఫ్యాక్టరీ నిర్వహణ కేంద్రం చేతిలో ఉన్నది. కానీ అప్పటి నుంచి కేంద్రం కనీసం పట్టించుకోలేదు.

సెప్టెంబర్‌ 7న మూతపడ్డ ఫ్యాక్టరీ సోమవారమే తిరిగి తెరుచుకున్నది. 12న మోదీ వస్తున్నందున అధికారులు హడావిడిగా మరమ్మతులు చేసి ఉత్పత్తిని ప్రారంభించినట్టు తెలిసింది. ఈ ప్రారంభోత్సవ ప్రహసనంలేకపోతే ఇంకెన్ని రోజులు ఫ్యాక్టరీ మూతపడి ఉండేదో తెలియదు. 60 రోజులుగా 1.8 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి ఆగిపోవటంతో నాలుగు రాష్ట్రాలకు ఎరువుల సరఫరా నిలిచిపోయింది. ఇది రైతులపై, వ్యవసాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఇవేవి పట్టించుకోని మోడీ రాజకీయ లబ్ధి కోసం ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమై తరుచూ రిపేర్లకు గురవుతున్న ఫ్యాక్టరీని కొత్తగా జాతికి అంకితం చేస్తానని బయలుదేరుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులు చేయాలని కోరినా కేంద్రం నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదని సమాచారం. దీంతో అధికారులే నానాకష్టాలు పడి సమస్య పరిష్కరించుకుంటున్నారు. మరి మోడీ ప్రారంభించి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరమ్మతులు రావన్న గ్యారెంటీ లేదు. మళ్ళీ ఇలాంటి సమస్యలే వస్తే కేంద్రం పట్టించుకుంటుందన్న గ్యారెంటీ కూడా లేదు.

ఇక మరొక అంశం... కేంద్ర బీజేపీ సర్కార్ రాష్ట్రప్రభుత్వాలను ఎలా అవమానిస్తుందో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్ర‌మం మరొక ఉదహరణ. ప్రధాని అధికారిక కార్యక్రమం ఏ రాష్ట్రంలో జరిగినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ప్రోటోకాల్. అందులోనూ ఇప్పటి విషయానికొస్తే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో రాష్ట్రప్రభుత్వానికి 11 శాతం వాటా కూడా ఉంది. ఈ కార్యక్రమ ఆహ్వాన పత్రంలో ప్రధాని తర్వాత ముఖ్యమంత్రి పేరు ఉండాల్సి ఉండగా అలా చేయకుండా ముఖ్యమంత్రిని అవమానించారని టీఆరెస్ ఆరోపిస్తోంది. దీనిపై ఆ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది.

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుండటంతో దాన్ని క‌ప్పి పుచ్చడానికి, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నుంచి ప్ర‌జలను పక్కదారి పట్టించడానికి, మునుగోడు ఓటమితో పడిన దెబ్బ నుండి కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడానికి మోడీ అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవడానికి తప్ప ఈ కార్యక్రమం మరెందుకు కాదనే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ రాజకీయ కార్యక్రమం ద్వారా తెలంగాణ బీజేపీకి ఏమైనా లాభం చేకురుతుందో లేదో వేచి చూడాలి.

Next Story