Telugu Global
Telangana

ఖమ్మంలో బాబు భారీ ప్రదర్శన దేనికి..?

చంద్రబాబు ఇలా తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించడం వెనుక బీజేపీని ఆకర్శించే ఎత్తుగడ ఉందన్న ప్రచారం నడుస్తోంది. గ్రేటర్ పరిధితో పాటు ఖమ్మం జిల్లాల్లో తమకు ఓటు బ్యాంకు ఉందని టీడీపీ అంచనా వేస్తోంది.

ఖమ్మంలో బాబు భారీ ప్రదర్శన దేనికి..?
X

ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ తగ్గించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ తన‌ పార్టీ ఉనికిని చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే టీ-టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమించారు. ఇతర పార్టీల్లో సరైన ప్రాధాన్యత దక్కని ఒక సామాజికవర్గం నేతలకూ గాలం వేస్తున్నారు. తెలంగాణలో టీడీపీకి భారీగా ఓట్లు, సీట్లు వచ్చే అవకాశం లేదని తెలిసినా చంద్రబాబు ఇప్పుడు తిరిగి తెలంగాణలో వేలు పెట్టడం వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.

Advertisement

బుధవారం ఖమ్మంలో భారీగా బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. కేవలం సభకు హాజరవ్వ‌డమే కాకుండా.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఖమ్మం వరకు చంద్రబాబు భారీ ర్యాలీతో వెళ్లనున్నారు. ఈ విషయాన్ని జ్ఞానేశ్వర్, కంభంపాటి ప్రకటించారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు టీడీపీ నేతలు, శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి.

చంద్రబాబు ఇలా తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించడం వెనుక బీజేపీని ఆకర్శించే ఎత్తుగడ ఉందన్న ప్రచారం నడుస్తోంది. గ్రేటర్ పరిధితో పాటు ఖమ్మం జిల్లాల్లో తమకు ఓటు బ్యాంకు ఉందని టీడీపీ అంచనా వేస్తోంది. భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా టీడీపీ ఓటు బ్యాంకు ఇంకా సజీవంగానే ఉందన్న సంకేతాలను బీజేపీకి పంపితే.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో తమ నుంచి ప్రత్యక్షంగా గానీ, లేదా పరోక్షంగా గానీ సాయం ఆశిస్తుందన్నది టీడీపీ భావన.

తెలంగాణలో అలా సహకారం అందిస్తే ఏపీలో బీజేపీతో పూర్తిస్థాయిలో కలిసి పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. అలా ఏపీ రాజకీయాల కోసం తెలంగాణలో బీజేపీని ఆకర్శించేందుకే ఖమ్మంలో భారీ సభకు టీడీపీ అధినేత సిద్ధమైనట్టు భావిస్తున్నారు.

Next Story