Telugu Global
Telangana

తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి? : మంత్రి కేటీఆర్

ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యతలో తెలంగాణ లేనప్పుడు.. తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని మాత్రం ఎందుకుండాలని కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి? : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న దిక్కుమాలిన బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఏముందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. విభజన హామీలు నెరవేర్చడంలో ప్రధాని మోడీ పూర్తిగా విఫలం అయ్యారన మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం ఓ ట్వీట్ చేశారు. తెలంగాణకు ఏమైనా కావాలని అంటే ప్రధాని మోడీ నోటి నుంచి 'ఇవ్వం' అనే మాట వస్తుందని అన్నారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు.. పసుపు బోర్డు ఇవ్వలేదు.. మెట్రో రెండో దశకు నిధులు ఇవ్వలేదు.. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వమన్నారు. గిరిజన యూనివర్సిటీ ఇవ్వమన్నారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా ఇవ్వమనే చెప్పారు. అసలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యతలో తెలంగాణ లేనప్పుడు.. తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని మాత్రం ఎందుకుండాలని ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ మాత్రం ఎందుకుండాలని మండిపడ్డారు. తెలంగాణలో నలుగురు వెన్నెముక లేని బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఒక్క హామీ కూడా నెరవేర్చని మోడీని ప్రశ్నించాల్సిన బాధ్యత వారికి లేదా అని అన్నారు.

తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని విభజన చట్టంలో ఉన్నది. కానీ ప్రధాని మోడీ మాత్రం తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు దానిని మంజూరు చేయించుకున్నారు. రూ.20వేల కోట్ల విలువైన ఆ ప్రాజెక్టు వస్తే తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందేది. కానీ దాన్ని మంజూరు చేయడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్నందుకు ఇలాంటి ఫలితాలే వస్తాయని దుయ్యబట్టారు.


First Published:  30 March 2023 1:24 PM GMT
Next Story