Telugu Global
Telangana

కేసీఆర్.. ఈటలను ఎందుకు పొగిడినట్టు..?

కేసీఆర్ ఏ వ్యూహంతో అటువంటి వ్యాఖ్యలు చేశారన్న విషయం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం ఈటల రాజేందర్​ కు బీజేపీలో పెద్దగా సౌకర్యంగా ఉండటం లేదు. ఆయన చాలా ఆశించి ఆ పార్టీలో చేరారు.

కేసీఆర్.. ఈటలను ఎందుకు పొగిడినట్టు..?
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు అంత తేలికగా ఎవరికీ అర్థం కావు. ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం వారు కోలుకునే లోపే దెబ్బ మీద దెబ్బ కొట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈటల రాజేందర్ విషయంలో ఇటీవల కేసీఆర్ సాఫ్ట్​ కార్నర్​ చూపించడం రాజకీయ పండితులకు కూడా అంతుచిక్కడం లేదు.

నిన్న కేసీఆర్​ అసెంబ్లీలో మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణకు ఎంతో అన్యాయం చేసిందని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. ఆ విషయం ఈటల రాజేందర్​ కు తెలుసన్నారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలతో రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఈటల బీఆర్ఎస్​ కు వెళ్లబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. చివరకు ఈటల ఈ విషయంపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను బీఆర్ఎస్ లో చేరడం లేదని చెప్పుకున్నారు.

కాగా కేసీఆర్ ఏ వ్యూహంతో అటువంటి వ్యాఖ్యలు చేశారన్న విషయం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం ఈటల రాజేందర్​ కు బీజేపీలో పెద్దగా సౌకర్యంగా ఉండటం లేదు. ఆయన చాలా ఆశించి ఆ పార్టీలో చేరారు. కానీ బీజేపీలో ఈటలకు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఇక్కడ బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి హవా నడుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఈటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటీవల పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఆయన గత్యంతరం లేని పరిస్థితిల్లోనే బీజేపీలో చేరారు. అవినీతి ఆరోపణలు, కేసులకు భయపడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

సీనియర్​ నేత, మంత్రిగా పనిచేసిన అనుభవం. తెలంగాణలో కీలక పాత్ర పోషించారు కాబట్టి.. బీజేపీలో తనకు సముచిత స్థానం ఉంటుందని ఈటల భావించారు. కానీ, అక్కడ పరిస్థితి వేరు. దీంతో ఈటల బీజేపీలో ఇమడలేకపోతున్నారన్న టాక్​ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఎన్నికల సమయానికి కాంగ్రెస్ లో చేరే చాన్స్ కూడా ఉందని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా కేసీఆర్ ఈటలను పొగడటంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. ఒకవేళ ఈటల మళ్లీ సొంతగూటి వైపు చూస్తున్నారా..? అన్న చర్చ సాగుతోంది. మరి ఈటల నిజంగానే బీఆర్ఎస్​ లో చేరతారా..? కేసీఆర్ వ్యాఖ్యల వెనక మర్మమెంటీ? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

First Published:  13 Feb 2023 2:35 PM GMT
Next Story