Telugu Global
Telangana

పాలమూరులో కాంగ్రెస్ టికెట్లు దక్కేది ఎవరికి?

మహబూబ్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు.

పాలమూరులో కాంగ్రెస్ టికెట్లు దక్కేది ఎవరికి?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికే 55 మందితో కూడిన తొలి జాబితా ప్రకటించింది. ఇందులో ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి ఏడుగురికి టికెట్లు కేటాయించారు. మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరో జాబితాపై కసరత్తు చేస్తోంది. పాలమూరుకు సంబధించిన మిగిలిన టికెట్లన్నీ రెండో జాబితాలోనే ప్రకటించే అవకాశాలు ఉండటంతో ఆశావహుల్లో టెన్ణన్ నెలకొన్నది.

మహబూబ్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నాయకుడు సంజీవ్ కూడా టికెట్ వస్తుందనే ఆశలు పెట్టుకున్నారు. కొన్నాళ్లుగా అధికార బీఆర్ఎస్ పార్టీపై పోరాడుతున్న నాయకుడిగా, బీసీ వర్గం నేతగా మంచి పేరు సంపాదించారు. ప్రజల్లో కూడా సంజీవ్‌పై సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇక కాంగ్రెస్ నాయకుడు ఎన్‌పీ వెంకటేశ్ కూడా తను టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు.

జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఇద్దరు బలమైన నాయకులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అనిరుధ్ రెడ్డితో పాటు ఎర్ర శేఖర్ టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. బలమైన బీఆర్ఎస్ అభ్యర్థిని ఎదుర్కునే శక్తి ఎర్ర శేఖర్‌కు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇరు వర్గాల నాయకులు విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తున్నారు.

జడ్చర్ల టికెట్ రాకపోతే కనీసం నారాయణపేట టికెట్ కావాలని ఎర్ర శేఖర్ పట్టుబడుతున్నారు. అయితే ఇప్పటికే డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి నారాయణ పేట టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి అవకాశం వచ్చినా పరస్పరం సహకరించుకోవాలనే ఒప్పందం కుదిరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మక్తల్ నియోజకవర్గంలో ఆశావహుల లిస్ట్ పెద్దగానే ఉన్నది. నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు వాకాటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కుమారుడు ప్రశాంత్ కుమార్‌రెడ్డి టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి తన భార్య లేదా కుమారుడు సిద్దార్థ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దేవరక్రద నుంచి మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రదీప్ కుమార్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి టికెట్ల కోసం వేచి చూస్తున్నారు. బీసీ కోటాలో తనకు టికెట్ వస్తుందని ప్రదీప్ కుమార్ ఆశ పెట్టుకున్నారు. ఇప్పటికే ఒక సారి ఢిల్లీకి వెళ్లి తన రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. మరోవైపు మధుసూదన్ రెడ్డి తనకే టికెట్ వస్తుందనే ధీమాతో నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.

First Published:  22 Oct 2023 8:57 AM GMT
Next Story