Telugu Global
Telangana

సీపీఎం ఒంటరి పోరు ఎవరికి లాభం?

కాంగ్రెస్ వైఖరి చూసి విసిగిపోయిన సీపీఎం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నది.

సీపీఎం ఒంటరి పోరు ఎవరికి లాభం?
X

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటుందని అందరూ భావించారు. బలమైన బీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే వామపక్షాల సహకారం అవసరమని పార్టీలో సీనియర్లు అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. కానీ వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసుకుంటామని చెప్పి ఎలా ఊరించి వదిలేసిందో.. ఇప్పుడు వామపక్షాలను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది.

కాంగ్రెస్ వైఖరి చూసి విసిగిపోయిన సీపీఎం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నది. సీపీఐ మాత్రం పొత్తు ఉంటుందనే ఆశతో ఎదురు చూస్తోంది. పొత్తులో భాగంగా అడిగిన సీట్లు ఇవ్వమంటే ఇవ్వలేదు. అయినా సరే సర్దుకున్నాం. కానీ చివరకు ఇస్తామన్నవి కూడా ఇవ్వకుండా సహకరించమంటున్నారు. ఇలాంటి అవమానాన్ని భరించలేకే ఒంటరి పోరుకు సిద్దపడ్డామని సీపీఎం చెబుతోంది. సీపీఎం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి లాభం చేకూరుస్తుందనే చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలోని 17 సీట్లలో పోటీ చేయాలని సీపీఎం నిర్ణయం తీసుకున్నది. సీపీఎంకు ఆయా నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్‌తో పాటు ఓటు బ్యాంకు కూడా ఉన్నది. కాంగ్రెస్‌ కలిసొస్తే కనీసం రెండు మూడు సీట్లు గెలుచుకుంటామని అంచనా వేసుకుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హ్యాండ్ ఇవ్వడంతో ఒంటరి పోరుతో అయినా లాభపడాలని సీపీఎం భావిస్తోంది. సీపీఎం ప్రకటించిన 17 సీట్లలో భద్రాచలం, పాలేరు, ఖమ్మం, వైరా, మిర్యాలగూడ, నకిరేకల్‌లో బలమైన ఓటు బ్యాంకు ఉన్నది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా కనీసం రెండు నుంచి మూడు సీట్లైనా గెలుచుకుంటామనే ధీమాతో సీపీఎం ఉన్నది.

సీపీఎం అంచనాలు ఎలా ఉన్నా.. ఈ నిర్ణయం కొన్ని పార్టీల గెలుపోటములను నిర్ణయించడం ఖాయమని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, వైరా, అశ్వారావుపేట, భద్రాచలం, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులు కాపాడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సీపీఎం ఒంటరి పోరుతో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, సీపీఎం మధ్య చీలిపోతే అంతిమంగా అది బీఆర్ఎస్‌కు లాభం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీపీఎం పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కనీసం 5 వేల ఓటు బ్యాంకు కచ్చితంగా ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో 15 వేలకు పైగా సీపీఎం ఓట్లు ఉన్నాయి. ఇవి గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్నది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత ఉండటం సహజమే. ఇప్పుడా ఓట్లు కాంగ్రెస్, సీపీఎం మధ్య చీలిపోయే అవకాశం ఉండటంతో.. అధికార బీఆర్ఎస్ భారీగా లాభపడనున్నది. సీపీఎంకు తోడు బీజేపీ కూడా తోడవటంతో అవి అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే నష్టాన్ని చేకూరుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అతివిశ్వాసంతోనే వామపక్షాలను పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది. సీపీఐకి టికెట్లు ఇచ్చినా.. సీపీఎంకి మాత్రం మొండి చేయి చూపడానికే మొదటి నుంచి నిర్ణయించుకున్నట్లు జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. అందుకే సీపీఎం కోరిన సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు సీపీఐ కోసం మాత్రం కొన్ని స్థానాలు వదిలేసింది. పొత్తు పూర్తిగా ఫైనల్ కాకపోయినా.. వారికి ఏయే సెగ్మెంట్లు ఇస్తారనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అందుకే సీపీఐ వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది. సీపీఎం పోయినా కనీసం సీపీఐని అయినా తమ వెంట ఉంచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తోంది. అందుకు పొత్తుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

First Published:  2 Nov 2023 5:10 PM GMT
Next Story