Telugu Global
Telangana

ఎంపీ అభ్యర్థులెవరు.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!

రేవంత్ రెడ్డి ఖాళీ చేసిన మల్కాజ్‌గిరి స్థానం కోసం పోటీ పడుతున్న ఆశావహుల సంఖ్య పెద్దగానే ఉంది. వీరిలో మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిన మైనంపల్లి హన్మంతరావు, ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిన మధుయాష్కి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఎంపీ అభ్యర్థులెవరు.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరు మీదున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టింది. తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అయితే ఇప్పుడు పార్టీకి కొత్త సమస్య మొదలైంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు ఆ పార్టీకి కరవయ్యారు. గతంలో ఎంపీలుగా పనిచేసిన వారంతా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో.. పార్టీకి కొత్త అభ్యర్థులను వెతుక్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలుండగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మల్కాజ్‌గిరి నుంచి రేవంత్ రెడ్డి, నల్గొండ నుంచి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఎంపీలుగా గెలిచారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా విజయం సాధించి ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. ఉత్తమ్‌, కోమటిరెడ్డిలకు మంత్రి పదవులు ద‌క్కాయి. దీంతో ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను వెతుక్కొవాల్సిన పరిస్థితి.

రేవంత్ రెడ్డి ఖాళీ చేసిన మల్కాజ్‌గిరి స్థానం కోసం పోటీ పడుతున్న ఆశావహుల సంఖ్య పెద్దగానే ఉంది. వీరిలో మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిన మైనంపల్లి హన్మంతరావు, ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిన మధుయాష్కి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక నల్గొండ ఎంపీ స్థానం పటేల్ రమేష్‌ రెడ్డికి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఆయన పోటీకి విముఖత చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంపీ సీటుకు బదులుగా తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని పటేల్ రమేష్‌ కోరుతున్నారని సమాచారం. ఇక నల్లగొండ ఎంపీ టికెట్‌ రేసులో జానారెడ్డి మరో తనయుడు రఘువీర్ పేరు కూడా వినిపిస్తోంది.

2019 ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి , ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన రమేష్ రాథోడ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇక పెద్దపల్లి నుంచి గతంలో ఎంపీగా పనిచేసిన వివేక్ వెంకటస్వామి ప్రస్తుతం చెన్నూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక గతంలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన పొన్నం సైతం హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఈ నాలుగు స్థానాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిజామాబాద్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మధుయాష్కి ఈసారి మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. మహబూబాబాద్‌ స్థానం కోసం బలరాం నాయక్ పట్టుబడుతున్నారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి. రేణుకా చౌదరి పోటీ చేస్తానని ఆసక్తి చూపుతున్నప్పటికీ.. పార్టీ ఆమెకు అవకాశం ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో పొంగులేటి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకూ కేవలం 5 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నుంచి సురేష్‌ షెట్కార్‌, మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ నుంచి మల్లు రవి, సికింద్రాబాద్ నుంచి మాజీ ఎంపీ అంజన్‌ కుమార్ యాదవ్‌ కుమారుడు అనిల్ కుమార్‌ యాదవ్‌, మెదక్ నుంచి విజయశాంతి పోటీ చేస్తారని సమాచారం.

First Published:  25 Dec 2023 12:30 AM GMT
Next Story