Telugu Global
Telangana

క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో ఉన్న ఐక్య‌త‌.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎక్క‌డ..?

కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికల ముందు ప్రకటించే సంప్రదాయం లేదు. అలాంటప్పుడు ఎవరైనా తాము సి.ఎం. కావాలన్న ఆశలు వ్యక్తం చేయడం వృథా ప్రయాస.

క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో ఉన్న ఐక్య‌త‌.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎక్క‌డ..?
X

తమలో తమకు అభిప్రాయ భేదాలున్నప్పటికీ కర్ణాటకలో సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్‌ కలిసి కాంగ్రెస్‌ పార్టీని గెలుపు బాటలో నడిపించారు. అసంతృప్తులని పక్కనపెట్టి కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పట్టుదలతో శ్రమించారు. ఈ చిత్తశుద్ధి, నిజాయితీ, పోరాటపటిమ మాత్రం ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటికీ కనిపించడం లేదు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవటం, కాంగ్రెస్‌ అత్యధిక సీట్లతో అధికారం కైవసం చేసుకోవ‌డం స్ఫూర్తిదాయక అంశాలు. కలసి పనిచేస్తే కలదు విజయం అని అక్కడి నాయకులు నిరూపించారు. ఆ స్ఫూర్తితో పని చేయాలన్న సంకల్పం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో లోపించిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. ప్రియాంక గాంధీ సరూర్‌నగర్‌ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ నేతల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. కానీ సీనియర్‌ నాయకులుగా చెలామణయ్యే వారి రకరకాల మాటలతో కాంగ్రెస్‌లో కీచులాటల పర్వం ముగియలేదనే జనం అనుకుంటున్నారు.

తాజాగా నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ ఎం.పి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభలో ఆయన్ను ‘‘సి.ఎం, సి.ఎం’’ అంటూ కొందరు నినాదాలు చేశారు. దానికి ‘‘సి.ఎం. అంటే అందరూ తనను కలిసి ఓడించే ప్రమాదం వుంది’’ అని ఆయన ప్రతిస్పందించడం సరదాగా తీసుకునే విషయం కాదు. అసంతృప్తులను, అంతర్గత విభేదాలను వ్యక్తంచేసే ధోరణి గానే పరిశీలకులు భావిస్తున్నారు.

మొన్నటికి మొన్న మరో సీనియర్‌ నేత వి.హెచ్‌. హనుమంతరావు తనని రాజీవ్‌గాంధీ సి.ఎం. చేయాలనుకున్నారని మాట్లాడటం... ఆయనలో సి.ఎం. కావాలన్న ఆరాటాన్ని సూచిస్తున్నది. అంతేగాక కొందరు తెలంగాణకు బిసి సిఎం కావాలని, దళిత సిఎం కావాలని మాట్లాడటం వల్ల కాంగ్రెస్‌పార్టీ జనం ముందు పలుచనవుతున్నది. విధానపరంగా దళితుడినో, బిసి నో ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయం తీసుకుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇలాంటి ఆలోచనే లేనప్పుడు పార్టీ నాయకులు ఇష్టానుసరంగా ప్రకటనలు చేయడం పార్టీలోని అంతర్గత తగాదాలను బయటపెడుతున్నది. సి.ఎం. కావాలనుకునే విభిన్నవర్గాల నేతల ఆశలని తెలియజేస్తున్నది. ఇది పార్టీలో ఐక్యతకు విఘాతం.. కలిసి పనిచేయడానికి ఆటంకం.

కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికల ముందు ప్రకటించే సంప్రదాయం లేదు. అలాంటప్పుడు ఎవరైనా తాము సి.ఎం. కావాలన్న ఆశలు వ్యక్తం చేయడం వృథా ప్రయాస. అంతేగాక రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం తగిన వ్యూహంతో ముందుకు వెళ్ళకుండా సి.ఎం. అభ్యర్థి రేసులో తాము ఉన్నామని చెప్పుకోవ‌డం ఆ పార్టీకి శోభనివ్వదు. వారిలోని అనైక్యతని బయట పెడుతున్నది. ఇది జనంలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అంతిమంగా ఎన్నికల్లో గెలుపు అవకాశాలకు విఘాతంగా పరిణమిస్తుంది. ఈ వివేచన దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్లకు లేకపోవడం విడ్డూరం.

రెండుసార్లు అధికారంలో వున్న కెసిఆర్‌ ప్రభుత్వం మీద సహజంగా కొన్ని వర్గాలలో వ్యతిరేకత ఉంటుంది. దీనిని గ్రహించే బిఆర్‌ఎస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కెసిఆర్‌ అన్నిరకాల కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ నిలుస్తుందన్న అభిప్రాయం జనాలలోకి బలంగా తీసుకెళ్ల‌గ‌ల‌గాలి. ఇందుకోసం పార్టీలోని భిన్నస్థాయిలలో ఉన్న నాయకులంతా ఐక్యంగా పని చేయాలి. కాంగ్రెస్‌ నేతలు సమైక్యంగా నిబద్ధతతో నిలబడ్డారన్న విశ్వాసాన్ని తెలంగాణ ప్రజానీకానికి కలిగించాలి.

అధికార పార్టీకి తన బలాలు, బలహీనతలు తెలుసు. వాటిని గ్రహించి తగిన ఎత్తుగడలతో ముందుకు వెళ్ళాల్సిన కాంగ్రెస్‌లో రకరకాల స్వరాలు వినిపిస్తున్నాయి. కెసిఆర్‌ను ఎదుర్కోగల దీటైన నాయకత్వం కాంగ్రెస్‌లో లేదనే భావన ఇప్పటికే జనాలలో వుంది. కాంగ్రెస్‌ సభలకు జనం బాగానే వస్తున్నారు. కానీ బిఆర్‌ఎస్‌కు నిజమైన, సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ అనే అభిప్రాయం బలంగా పాదుకోవలసి వుంది. ఇది జరగాలంటే కాంగ్రెస్‌ నేతలు ఇంటా బయటా ఐక్యతారాగం వినిపించాలి. ఎవరి దారిన వాళ్ళు సభలు పెట్టుకుంటే సరిపోదు. కాంగ్రెస్‌ నేతలంతా ఉమ్మడిగా ప్రజల ముందుకు రావాలి. తమ అసంతృప్తులను, తగాదాలను పక్కన పెట్టి పట్టుదలతో గెలుపు కోసం పనిచేయాలన్న నిబద్ధత నెలకొనాలి. తాము ఐక్యంగా ఉన్నాము, ఉంటాము అనే భరోసా ప్రజలకు కల్పించాలి. తెలంగాణను ఇచ్చిన పార్టీగా చెప్పుకోగానే సరిపోదు, తెలంగాణకు తాము కొత్తగా ఏం చేస్తామో విస్పష్టంగా చెప్పగలగాలి. ఈ చెప్పే క్రమాన నాయకులవి భిన్న స్వరాలు కాకూడదు. తెలంగాణకు సరికొత్త భవిష్యత్తును అందిస్తామని ఏకస్వరంతో చెప్పగలగాలి. ఈ క్రమాన వారి మాటల్లో, చేతల్లో నిజాయితీ, చిత్తశుద్ధి ప్రతిఫలించాలి. అప్పుడే తెలంగాణ కాంగ్రెస్‌పై జనాల్లో విశ్వసనీయత పాదుకుంటుంది.

Next Story