Telugu Global
Telangana

జూపల్లి, నాగంకు మధ్య ఎక్కడ చెడింది? నాగర్‌కర్నూల్ టికెట్‌పై రభసెందుకు!

గతంలో వీరిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడే విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరూ ఓకే పార్టీలో ఉన్నా.. అవి అలాగే కొనసాగుతున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు.

జూపల్లి, నాగంకు మధ్య ఎక్కడ చెడింది? నాగర్‌కర్నూల్ టికెట్‌పై రభసెందుకు!
X

తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ కూడా కర్ణాటక ఫార్ములాను అనుసరిస్తోంది. ఇతర పార్టీల్లోని బలమైన నాయకులు, గతంలో పార్టీని వీడిన నాయకులను చేర్చుకుంటూ ఆయా నియోజకవర్గాల్లో బలాన్ని పెంచుకుంటోంది. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పాలమూరుకు చెందిన జూపల్లి కృష్ణారావును ఇవే అంచనాలతో చేర్చుకున్నది. వీరి రాకతో ఆయా జిల్లాల్లో బలం పెరుగుతుందని, పార్టీ క్యాడర్‌లో కూడా ఉత్సాహం వస్తుందని భావించింది. అయితే.. వీరిద్దరి రాకతో ఆయా జిల్లాల కాంగ్రెస్ క్యాడర్‌లో వ్యతిరేకత కూడా మొదలైంది.

ఖమ్మం జిల్లా విషయం కాస్త పక్కన పెడితే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూపల్లి రాకతో కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి ఏకంగా జూపల్లిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఉమ్మడి జిల్లాలో భారీ సంఖ్యలో టికెట్లు అడుగుతున్నాడంటూ ఆరోపణలు చేశారు. నాగం ఆరోపణలు నిజమేనా అంటే.. జిల్లా క్యాడర్ కూడా అవుననే అంటోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌లోనే ఉండి.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన కృష్ణారావుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలమైన పట్టే ఉంది. నాగం జనార్థన్ రెడ్డి టీడీపీలో ఉండగా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత బీజేపీలో చేరి.. అక్కడ ఇమడ లేక కాంగ్రెస్‌లోకి వచ్చారు. గతంలో వీరిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడే విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరూ ఓకే పార్టీలో ఉన్నా.. అవి అలాగే కొనసాగుతున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు.

జూప్లలి కృష్ణారావు పార్టీలో చేరడానికి ముందే తనకు కొల్లాపూర్ సీటుతో పాటు తన అనుచరులకు కూడా టికెట్లు కావాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ అధిష్టానం కొంత మేరకు జూపల్లి డిమాండ్లకు ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది. జూపల్లి కృష్ణారావు తన డిమాండ్లలో నాగర్‌కర్నూల్ టికెట్ కూడా కోరినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కే.దామోదర్ రెడ్డి కుమారుడు కే. రాజేశ్ రెడ్డికి నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వాలని జూపల్లి కోరారు. దీంతో పాటు తన అనుచరులకు గద్వాల్, వనపర్తి టికెట్లు కూడా కోరినట్లు తెలుస్తున్నది.

నాగర్‌కర్నూల్ నుంచి నాగం జనార్థన్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో తొలిసారి నాగర్‌కర్నూల్ గెలిచిన నాగం.. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినా.. 1994 నుంచి 2014 వరకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. 2014లో బీజేపీ తరపున, 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసినా ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో నాగం తీరును గమనించిన ప్రజలు ఆయన్ను ఓడించారని స్థానికులు చెబుతుంటారు. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత నాగం రాజకీయ జీవితం మసకబారిపోయింది. ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూల్ టికెట్‌ను రాజేశ్ రెడ్డికి ఇవ్వాలని జూపల్లి కోరినట్లు తెలుస్తున్నది.

తాను రెండున్నర దశాబ్దాల పాటు ప్రాతినిథ్యం వహించిన నాగర్ కర్నల్ సీటును వేరే వారికి ఇప్పించాలని జూపల్లి ప్రయత్నించడం వల్లే నాగం జనార్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను ఈ సారి ఎన్నికల బరిలో ఉంటానని నాగం చెబుతున్నారు. అయితే నాగంకు టికెట్ ఇస్తే నాగర్ కర్నూల్‌ను వదులుకోవాల్సిందే అని జూపల్లి వాదిస్తున్నారు. తాను చెప్పిన వారికి టికెట్ ఇస్తే తప్పకుండా గెలిపించుకుంటానని అంటున్నారు. ఇప్పటికే ఈ పంచాయితీ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. అయితే, టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని.. సర్వే చేసిన తర్వాతే టికెట్లు కేటాయిస్తామని రేవంత్ సూచించినట్లు సమాచారం.

రేవంత్ రెడ్డిది కూడా ఉమ్మడి పాలమూరు జిల్లానే.. గతంలో నాగంతో కలిసి టీడీపీలో ఉన్న వ్యక్తే. అయినా సరే ఆయనకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ కూడా సుముఖంగా లేనట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. బయటకు ఏమీ చెప్పలేకే దరఖాస్తు చేసుకోమని రేవంత్ సూచించారని.. చివరకు నాగంను సైడ్ చేయడం ఖాయమని పార్టీలో చర్చ జరుగుతోంది.

First Published:  21 Aug 2023 5:24 AM GMT
Next Story