Telugu Global
Telangana

కాంగ్రెస్ సభ ఎక్కడ? ఏటూ తేల్చని నాయకత్వం.. కార్యకర్తల ఆందోళన!

దేవాలయ స్థలంలో రాజకీయ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వమని దేవాదాయ శాఖ కమిషన్ అనిల్ కుమార్ లిఖిత పూర్వకంగా తెలియజేశారు.

కాంగ్రెస్ సభ ఎక్కడ? ఏటూ తేల్చని నాయకత్వం.. కార్యకర్తల ఆందోళన!
X

కాంగ్రెస్ పార్టీ 16 ఏళ్ల తర్వాత సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయక్వం అంతా ఈ సమావేశాలకు హాజరవుతారు. మరో వైపు తెలంగాణ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో ఈ నెల 17న భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే సహా మరి కొందరు నాయకులు ఈ సభలో పాల్గొనే అవకాశం ఉండటంతో భారీగా జన సమీకరణ చేయాలని భావిస్తోంది. అంతా బాగున్నా.. సభకు మరో వారం రోజుల సమయమే ఉన్నా.. ఒకా సభాస్థలిని మాత్రం కన్ఫార్మ్ చేయలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సభా స్థలిని నిర్ణయించకపోతే మేము ఎలా సిద్ధం కావాలని వారు ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ నాయకత్వం వాస్తవానికి పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో ఎల్బీస్టేడియంలో సభ ఏర్పాటుకు దరఖాస్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియం ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఆ స్టేడియం సరిపోదని భావించిన నాయకులు ఇతర ప్రదేశాలను పరిశీలించారు.

కూకట్‌పల్లిలోని కైతలాపూర్, గచ్చిబౌలి స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలను పరిశీలించారు. గతంలో ప్రియాంక గాంధీ సభను సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించినప్పుడు సరిపోలేదని.. ఇప్పుడు అగ్రనాయకులు అంతా వస్తుండటంతో భారీగా జనసమీకరణ చేస్తున్నాము. కాబట్టి ఆ స్టేడియం వద్దని కొందరు నాయకులు సూచించారు. దీంతో కొంగరకలాన్, తుక్కుగూడ ప్రాంతాలను టీపీసీసీ నాయకులు పరిశీలించారు.

తుక్కుగూడలోని శ్రీనగర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్లో సభ నిర్వహించాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులకు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. అయితే మతపరమైన సంస్థల చట్టం 5, 6 ప్రకారం స్థలాల దుర్వినియోగ నియంత్రణ కింద.. దేవాలయ స్థలంలో రాజకీయ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వమని దేవాదాయ శాఖ కమిషన్ అనిల్ కుమార్ లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దీంతో కాంగ్రెస్ నాయకుల ఆదరాబాదరాగా మరో స్థలం వెతికే పనిలో పడ్డారు.

కొంగరకలాన్‌లో సభకు అనువైన ప్రైవేట్ స్థలాలు ఉన్నాయి. అయితే విమానాశ్రయానికి దూరంగా ఉండటంతో అగ్రనాయకుల రాకపోకలకు ఆటంకం ఉంటుందని భావించారు. దీంతో తుక్కుగూడలోని ప్రైవేటు భూములు వెతికే పనిలో పడ్డారు. అక్కడ ఖాళీ స్థలాలు ఉండటంతో సంబంధిత యజమానులను సంప్రదించే పనిలో పడ్డారు. శనివారం సాయంత్రం లోగా సభా స్థలిపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది.

First Published:  9 Sep 2023 1:39 AM GMT
Next Story