Telugu Global
Telangana

ట్విట్టర్ బ్లూటిక్‌ను ఏం చేద్దాం? తెలంగాణ ఐటీ విభాగంలో చర్చ!

ట్విట్టర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పలు అకౌంట్లు 'బ్లూ' నుంచి 'గ్రే' కలర్‌లోకి మారనున్నాయి.

ట్విట్టర్ బ్లూటిక్‌ను ఏం చేద్దాం? తెలంగాణ ఐటీ విభాగంలో చర్చ!
X

క్రీడాకారులు, సినిమా నటులు, సెలెబ్రిటీలే కాకుండా ప్రభుత్వ సంస్థలు కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాయి. ముఖ్యంగా ట్విట్టర్‌లో ప్రభుత్వ విభాగాలు తమ అధికార ప్రకటనలు విడుదల చేయడానికి ఉపయోగిస్తుంటాయి. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పలు శాఖలు కూడా ట్విట్టర్‌లో అధికారిక అకౌంట్లు కలిగి ఉన్నాయి. వీటిని ఎంతో మంది ఫాలో అవుతున్నారు. బ్లూటిక్ వెరిఫికేషన్ ఉండటంతో ఆయా అకౌంట్లలో వచ్చే సమాచారాన్ని ప్రభుత్వ అధికారిక ప్రకటనగానే ప్రజలు భావిస్తారు.

ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా 'బ్లూ టిక్'కు సంబంధించి ఆ మధ్య పైలెట్ టెస్టింగ్ చేసిన తర్వాత.. తాజాగా సోమవారం నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రకటించారు. వెబ్/ఆండ్రాయిడ్ యూజర్లు అయితే నెలకు 8 డాలర్లు, ఐఫోన్ యూజర్లయితే నెలకు 12 డాలర్లుగా నిర్ణయించింది. ఇలా సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి బ్లూటిక్ లభిస్తుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఈ బ్లూటిక్ అందిస్తామని ట్విట్టర్ చెబుతోంది. మరోవైపు ఇప్పటి వరకు 'అఫీషియల్' ట్యాగ్ ఉన్న అకౌంట్లు త్వరలో గోల్డ్ చెక్ మార్క్‌ను పొందుతాయి. ఇక ప్రభుత్వ అధికార అకౌంట్లు గ్రే కలర్ మార్క్‌ను సొంతం చేసుకుంటాయి.

ట్విట్టర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పలు అకౌంట్లు 'బ్లూ' నుంచి 'గ్రే' కలర్‌లోకి మారనున్నాయి. ఇప్పటి వరకు బ్లూ టిక్ ఉంటే అధికారిక ఖాతాగా ప్రజలు భావిస్తూ వచ్చారు. అదే గ్రే కలర్‌లోకి మారితే గందరగోళానికి దారి తీస్తుందేమో అనే అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం కనుక ఆయా అకౌంట్లకు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బ్లూ కలర్ టిక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంపై తెలంగాణ ఐటీ శాఖలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

బ్లూ టిక్‌పై ట్విట్టర్‌తో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని.. అప్పటి వరకు సబ్‌స్క్రిప్షన్ తీసుకోబోవడం లేదని ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. నకిలీ అకౌంట్ల నుంచి రక్షించడానికే బ్లూ టిక్‌ను ఉపయోగిస్తున్నారు. ఇతరులు అదే పేరుతో మరో అకౌంట్ తెరవకుండా ఇది నిరోధిస్తుంది. అయితే ఫేక్ అకౌంట్లను పూర్తిగా తొలగిస్తున్నట్లు ట్విట్టర్ చెబుతోంది. అప్పుడు అసలైన అకౌంట్లకు బ్లూ టిక్ లేకపోయినా పెద్ద సమస్య కాదని భావిస్తున్నట్లు జయేశ్ రంజన్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ట్విట్టర్ అకౌంట్లలో ఒక్కో దానికి కనీసం 2 లక్షల నుంచి 15 లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు. చాలా సార్లు ప్రజలు ఈ అకౌంట్ల ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వస్తున్నారు. అంతే కాకుండా ప్రజలకు తక్షణమే సమాచారం అందించడానికి ఈ అకౌంట్లు ఉపయోగపడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి బ్లూ టిక్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ట్విట్టర్ తమ పాలసీని పూర్తిగా ప్రకటించిన తర్వాత ముందు వెళ్తామని తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ వెల్లడించారు. అవసరం అయితే ప్రభుత్వ అకౌంట్లకు ఫ్రీగానే సబ్‌స్క్రిప్షన్ ఇచ్చేలా ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ సీఎంవో ( 1.5 మిలియన్ ఫాలోవర్లు), మినిస్టర్ ఫర్ ఐటీ, ఎంఏ అండ్ యూడీ (9.70 లక్షలు), డీజీపీ ఆఫీస్ (5.27 లక్షలు), హైదరాబాద్ పోలీస్ (4.60 లక్షలు), సైబరాబాద్ పోలీస్ (3.79 లక్షలు), సీపీ హైదరాబాద్ (3.39 లక్షలు), జీహెచ్ఎంసీ (3.28 లక్షలు), తెలంగాణ స్టేట్ పోలీస్ (2.59 లక్షలు), హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (2.11 లక్షలు), రాచకొండ పోలీస్ (1.79 లక్షలు), సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (1.72 లక్షలు) అకౌంట్లు మనుగడలో ఉన్నాయి. మిగిలిన వాటికంటే ఈ అకౌంట్లను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లు ఎక్కువ.

First Published:  13 Dec 2022 3:33 AM GMT
Next Story