Telugu Global
Telangana

గవర్నర్ల వ్యవస్థ వల్ల దేశానికి ఏం ఉపయోగం : మంత్రి కేటీఆర్

ఒక పార్టీ గురించే మాట్లాడుతూ, ఆ పార్టీ నాయకుల ఫొటోలే రాజ్‌భవన్‌లో పెట్టుకుంటూ.. రాజ్‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం దేశానికి, వ్యవస్థకు మంచిది కాదని కేటీఆర్ అన్నారు.

గవర్నర్ల వ్యవస్థ వల్ల దేశానికి ఏం ఉపయోగం : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గవర్నర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వాళ్ల బానిసత్వ చిహ్నాలను తొలగించాలని ప్రధాని మోడీ ఇటీవల పిలుపునిచ్చారు. అలాంటప్పుడు గవర్నర్ల వ్యవస్థను మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఆ వ్యవస్థ వల్ల దేశానికి ఏం ఉపయోగమని అన్నారు. సిరిసిల్ల పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌పై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయడంపై స్పందన తెలియజేయాలని విలేకరులు కోరారు. అయితే తాను ఉదయం నుంచి ఇటే ఉన్నానని.. హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో పూర్తిగా అవగాహన లేదన్నారు.

Advertisement

బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి రాజ్యాంగ పరమైన వ్యవస్థలను గౌరవించే సంస్కృతి ఉందన్నారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన విషయాలను సీఎం కేసీఆర్, శాసన సభ వ్యవహారాల మంత్రి చూసుకుంటారని చెప్పారు. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న వారు కూడా పార్టీకి ప్రతినిధులుగా, పార్టీలకు అనుకూలంగా, పార్టీకి సంబంధించిన చర్చల్లో పాల్గొని రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఒక పార్టీ గురించే మాట్లాడుతూ, ఆ పార్టీ నాయకుల ఫొటోలే రాజ్‌భవన్‌లో పెట్టుకుంటూ.. రాజ్‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం దేశానికి, వ్యవస్థకు మంచిది కాదని కేటీఆర్ అన్నారు. ఆజాదీకా అమృతోత్సవ్‌లో బ్రిటిష్ కాలపు బానిత్వపు పోకడలు పోవాలని ప్రధాని మోడీ ప్రసంగించారు. అందుకే రాజ్‌పథ్ పేరును కూడా కర్తవ్య్ పథ్ అని మార్చినట్లు మోడీ ప్రకటించారు. మరి అలాంటప్పుడు గవర్నర్ల వ్యవస్థ కూడా బ్రిటిష్ వాళ్లు పెట్టిందే కదా.. మరి దానిని ఎందుకు కొనసాగిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు అవి ఉండాల్సిన అవసరం ఏంటి? దేశానికి వచ్చిన ఉపయోగం ఏంటో అర్థం కావడం లేదని అన్నారు.

Advertisement

సర్కారియా కమిషన్‌తో పాటు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా ఒక మాట చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వారు వాటికి 2 ఏళ్ల పాటు దూరంగా ఉన్నప్పుడే గవర్నర్ పదవి ఇవ్వాలని అన్నారు. మరి మోడీ ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ నీతులు చెప్పారు. ఇప్పుడు పీఎం అయ్యాక అవే నీతులను తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. బానిసత్వపు చిహ్నాలుగా ఉన్న వాటిని తొలగిస్తానన్న మోడీ.. ఇప్పుడు ఈ గవర్నర్ వ్యవస్థపై కూడా పునరాలోచించుకోవాలని కేటీఆర్ సూచించారు.

ఇండియాలో ఇప్పుడు ప్రజాస్వామ్యం అమలులో ఉన్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, పీఎం, సీఎంలు ఉన్నారు. బ్రిటిష్ కాలంలో రాణి నియమించిన వైశ్రాయ్ ఉండేవారు. ఆయన కింద గవర్నర్ ఉండేవారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు గవర్నర్లు ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు. గవర్నర్లను ఒక రాజకీయ పరమైన పని ముట్టుగా మార్చుకుంటున్న మోడీ ఇవన్నీ ఆలోచించుకోవాలని కేటీఆర్ అన్నారు.

Next Story