Telugu Global
Telangana

కోదండరాం ఎమ్మెల్సీ వివాదం.. హైకోర్టు ఏమందంటే..!

కోదండరాం, అలీఖాన్‌ పేర్లను గత డిసెంబర్‌లో మంత్రివర్గం ఆమోదించిందని, ఎమ్మెల్సీలుగా నియమించేందుకు కావాల్సిన అన్ని అర్హతలు వారికి ఉన్నాయని ప్రతివాదుల తరఫు లాయర్ అవినాశ్‌ దేశాయ్‌ అన్నారు.

కోదండరాం ఎమ్మెల్సీ వివాదం.. హైకోర్టు ఏమందంటే..!
X

గవర్నర్‌ కోటా కింద ప్రొఫెసర్‌ కోదండరాం, ‘సియాసత్‌’ పత్రిక ఎడిటర్‌ అమీర్‌ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమించడంపై వివాదం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ వేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. మంత్రివర్గ సిఫారసులకు గవర్నర్‌ కట్టుబడి ఉండాలని, అయితే ఆ సిఫార్సులను పరిశీలించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంటుందని ప్రతివాదుల తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదించారు. ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణను నియమించాలంటూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్‌ తిరస్కరించారని, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ మంత్రివర్గం మళ్లీ అవే పేర్లను పునఃపరిశీలించాలని సిఫారసు చేసి ఉంటే గవర్నర్‌ ఆమోదించి ఉండేవారని చెప్పారు.

కోదండరాం, అలీఖాన్‌ పేర్లను గత డిసెంబర్‌లో మంత్రివర్గం ఆమోదించిందని, ఎమ్మెల్సీలుగా నియమించేందుకు కావాల్సిన అన్ని అర్హతలు వారికి ఉన్నాయని ప్రతివాదుల తరఫు లాయర్ అవినాశ్‌ దేశాయ్‌ అన్నారు. ఎమ్మెల్సీలుగా నియమితులైన వారికి అర్హతలు ఉన్నా, లేకపోయినా వారి నియామక జీవోలను సవాలు చేయవచ్చన్నారు. అలా కాకుండా తమను ఎమ్మెల్సీలుగా నియమించాలని కోరే హక్కు ఎవరికీ ఉండదని తెలిపారు. మంత్రి మండలి, గవర్నర్ల కంటే రాజ్యాంగం అత్యున్నతమైందని చెప్పారు. గవర్నర్‌ విచక్షణాధికారాలపై న్యాయసమీక్షకు ఆస్కారం లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేసిందని పలు తీర్పులను ప్రస్తావించారు. దీంతో మంత్రివర్గ సిఫారసులను తిరస్కరించడం, పునఃపరిశీలించడం వేర్వేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై తమ వాదన వినిపించేందుకు గడువు కావాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరడంతో విచారణ ఈనెల 14కు వాయిదా పడింది.

First Published:  13 Feb 2024 2:20 AM GMT
Next Story