Telugu Global
Telangana

ఆరు గ్యారెంటీల అమలు.. ఎంత ఖర్చంటే..!

ఇప్పటికే ఉన్న పథకాలతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ఏటా రూ.1.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం మాత్ర‌మే ఏటా రూ. 68,652 కోట్లు అవసరమని తెలుస్తోంది.

ఆరు గ్యారెంటీల అమలు.. ఎంత ఖర్చంటే..!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ విజయంలో ఆరు గ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడంలో ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు. కొన్ని హామీలను భవిష్యత్‌లో నెరవేర్చగలిగినప్పటికీ.. మరికొన్ని తక్షణమే నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు హామీల విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు పోటీపడ్డాయి.

నిజానికి బీఆర్ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌ ఎక్కువ హామీలు ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళలకు నెలవారీ ఆర్థికసాయం, రైతు భరోసా కింద ఎకరాకు రూ.16 వేలు, రూ.500కే గ్యాస్ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ లాంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్.

ఇప్పటికే ఉన్న పథకాలతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ఏటా రూ.1.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం మాత్ర‌మే ఏటా రూ. 68,652 కోట్లు అవసరమని తెలుస్తోంది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.20 వేల కోట్లు అవసరం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, వ్యయం దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. రాష్ట్ర సొంత పన్ను ఆదాయం, కేంద్ర నిధులతో కలిపి రూ. లక్షా 72 వేల కోట్లు. రాష్ట్ర బడ్జెట్ దాదాపు రూ. 1.9 లక్షల కోట్లుగా ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

ఆర్టీసీ లాంటి కార్పొరేషన్‌లు ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. ఇక మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఆర్టీసీకి రూ. 10 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అమలు చేస్తే డిస్కమ్‌లకు ఏటా రూ. 5 వేల కోట్లు క‌ట్టాల్సిందే. ఈ హామీలన్నీ అమలు చేయాలంటే రుణాలు తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే ఇప్పటికే రాష్ట్రం రుణ పరిమితిని చేరుకుందని.. రుణాలు తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తవచ్చని అంటున్నారు.

First Published:  6 Dec 2023 10:52 AM GMT
Next Story