Telugu Global
Telangana

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారతారా? రిటైర్ అయిపోతారా?

ఆస్ట్రేలియాలో ఉన్న వెంకటరెడ్డి ఇప్పట్లో షోకాజ్ నోటీసుకు స్పందిస్తారనే ఆశ ఏఐసీసీ పెట్టుకోలేదు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారతారా? రిటైర్ అయిపోతారా?
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి బ్రదర్స్ చేసినంత డ్యామేజ్ మరెవరూ చేయలేదు. బీజేపీలోకి జంప్ అయిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికకు కారణం అయితే.. స్వయంగా తాను ఏరి కోరి, అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి ఎంపిక చేసిన స్రవంతిని ఏకాకిని చేసింది మాత్రం వెంకటరెడ్డి. ఆర్థిక పరంగా ఆదుకుంటానని మాట ఇచ్చిన వెంకటరెడ్డి.. ఎక్కడ తమ్ముడు ఓడిపోతాడో అనే భయంతో పైసా విదిల్చలేదు. మరోవైపు పాల్వాయి స్రవంతి తరపున కాంగ్రెస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా నాలుగైదు రోజుల పాటు మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు. కానీ పార్టీ నుంచి కానీ, ఇతర నాయకుల నుంచి కానీ స్రవంతికి ఆర్థికపరమైన సాయం అందడం లేదు.

ఇక వెంకటరెడ్డి స్వయంగా కాల్స్ చేసి తమ్ముడికి ఓట్లేయమని అడగటం.. కాబోయే పీసీసీ చీఫ్ నేనే అని చెప్పడం.. పాదయాత్ర చేసి సీఎం అయిపోతానని ప్రగల్భాలు పలకడం పార్టీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని.. ఇందుకు కారణం తెలియజేయాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న వెంకటరెడ్డి ఇప్పట్లో షోకాజ్ నోటీసుకు స్పందిస్తారనే ఆశ ఏఐసీసీ పెట్టుకోలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉపఎన్నిక తర్వాత పార్టీ మారడమో.. రాజకీయాల నుంచి తప్పుకోవడమో చేస్తారనే చర్చ జరుగుతుంది.

కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన వివరణ ఇవ్వడం కష్టమే. ఇచ్చినా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తప్పకుండా సస్పెండ్ చేస్తుంది. అంతకు ముందే వెంకటరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోతారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాక దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. మునుగోడులో కనుక తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే.. రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గెలిస్తే మాత్రం బీజేపీలో చేరతారని తెలుస్తున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యాపారాలు సజావుగా సాగాలంటే తప్పకుండా బీజేపీ సపోర్ట్ కావాలి. అందుకే అటువైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరితే భువనగిరి ఎంపీగా పోటీలో ఉంటారా అనేది అనుమానమే. ఇప్పటికే బీజేపీ బూర నర్సయ్య గౌడ్‌కు ఆ సీటు ఇస్తామని మాట ఇచ్చింది. వెంకటరెడ్డి తిరిగి నల్గొండ ఎమ్మెల్యేగా బీజేపీ తరపున పోటీ చేస్తారని భావిస్తున్నారు. వీలుంటే సీఎం సీటు కొట్టేయాలనే ప్లాన్ కూడా వేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. ఏదేమైనా మునుగోడు ఫలితం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పెద్ద విషమ పరీక్ష కాబోతోంది.

First Published:  24 Oct 2022 6:27 AM GMT
Next Story