Telugu Global
Telangana

తెలంగాణలో ఏం జరుగుతోంది.? 800 మంది పరిశీలకులను పంపనున్న బీజేపీ!

బీజేపీ పంపనున్న 800 మంది పరిశీలకులు రేపటి నుంచి (జూన్ 28) మండలాల్లో పర్యటించనున్నారు.

తెలంగాణలో ఏం జరుగుతోంది.? 800 మంది పరిశీలకులను పంపనున్న బీజేపీ!
X

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి? కేంద్రంలో అధికారంలో ఉన్నాసరే.. చాలా మంది నాయకులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏమై ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఎదుర్కోవాలి? క్షేత్ర స్థాయిలో బీజేపీకి ఉన్న బలం ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్ర నాయకులు పంపే రిపోర్టులపై నమ్మకం లేని బీజేపీ హైకమాండ్.. భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. 800 మంది పరిశీలకులను తెలంగాణకు పంపనున్నది. రాష్ట్రంలోని 800 మండలాల్లో వారు పర్యటించి, పూర్తి నివేదికను అధిష్టానానికి చేరవేయనున్నారు.

బీజేపీ పంపనున్న 800 మంది పరిశీలకులు రేపటి నుంచి (జూన్ 28) మండలాల్లో పర్యటించనున్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో బీజేపీ ఎంత వరకు సిద్ధంగా ఉన్నదనే విషయాలను వీరు పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తారు. రాష్ట్రంలోని మండలాలు, పట్టణాలు, గ్రామాల్లో వీరు పర్యటించనున్నారు. ప్రతీ టీమ్ మండల స్థాయిలో వారం రోజుల పాటు క్షేత్ర స్థాయి పరిశీలన జరుపుతారని పార్టీ వర్గాలు చెప్పాయి.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్, మీజోరాంతో పాటు తెలంగాణకు పరిశీలకును పంపుతున్నది. మొదట చత్తీస్‌గడ్ నుంచి పరిశీలకులను తెలంగాణ పంపాలని బీజేపీ అధిష్టానం భావించింది. అయితే ఇప్పుడు మాత్రం దక్షిణాది రాష్ట్రాల నుంచి 800 మందిని ఎంపిక చేసి తెలంగాణకు కేటాయించింది. వీరిని 'స్వల్ప్ కాలిక్ విస్తారక్స్'గా పిలవనున్నారు. తమిళనాడు నుంచి 250 మంది, కర్ణాటక నుంచి 130, ఆంధ్రప్రదేశ్ నుంచి 120, కేరళ నుంచి 120, మరి కొంత మంది అండమాన్ అండ్ నికోబార్ నుంచి రానున్నారు. దక్షిణాది రాష్ట్రాల విస్తారక్స్ అయితేనే తెలంగాణలోని భాషను, సంస్కృతిని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణలో 900పైగా మండలాలు ఉన్నాయి. వీటిలో 800 మండలాల్లో స్వల్ప్ కాలిక్ విస్తారక్స్ క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. బూత్ లెవల్‌ నుంచి పార్టీ పరిస్థితిని వారు అంచనా వేస్తారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరు సమర్థులు, ఎవరు ఆసక్తిగా ఉన్నారనే విషయాలను కూడా నివేదికలో పొందుపరుస్తారు.

మండల స్థాయిలో చిన్న సమావేశాలు పెట్టి.. పార్టీ నాయకుల సమస్యలు, ఫిర్యాదులు కూడా తీసుకోవడానికి విస్తారక్స్‌కు అధిష్టానం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే విషయాలను కూడా పార్టీ కేడర్ నుంచి అడిగి తెలుసుకుంటారు. విస్తారక్స్ ఇచ్చే సమగ్ర నివేదిక ఆధారంగా తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని బీజేపీ సిద్ధం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

First Published:  27 Jun 2023 2:48 AM GMT
Next Story