Telugu Global
Telangana

BRS ఆత్మీయ సమ్మేళనాల్లో ఏం జరుగుతోంది ?

ఈ ఏడాది చివరిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు ఆత్మీయ సమ్మేళనాలు పార్టీకి అనువైన వేదికలుగా మారుతున్నాయి.

BRS ఆత్మీయ సమ్మేళనాల్లో ఏం జరుగుతోంది ?
X

భారత రాష్ట్ర సమితి (BRS) ఆత్మీయ సమ్మేళనాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయమే ప్రధాన ఎజెండాగా, వివిధ వేదికల ద్వారా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య బలమైన బంధం ఉండేలా బహుముఖ వ్యూహాలకు ఆత్మీయ సమ్మేళనాలు వేదికలయ్యాయి.

గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో సహా నియోజకవర్గాల వారీగా సమావేశాలకు నాయకులు, కార్యకర్తలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు.

ఈ ఏడాది చివరిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు ఆత్మీయ సమ్మేళనాలు పార్టీకి అనువైన వేదికలుగా మారుతున్నాయి.

ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి అనేక వ్యూహాలతో ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయని బిఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్‌చార్జి, సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం బీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా అవసరమని ఆయన అన్నారు.

ఆత్మీయ సమ్మేళనాల ద్వారా నాయకుల మధ్య విభేదాలు ఉంటే వాటిని పరిష్కరిస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు, డివిజన్ల వారీగా యూనిట్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పార్టీ టీమ్ స్పిరిట్‌ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో సాధించిన సంక్షేమం, అభివృద్ధిని తెలియజేయడం కూడా సమావేశాలలో ప్రధాన ఎజెండాగా ఉంది. భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను గుర్తించడంతోపాటు డివిజన్ల వారీగా, కాలనీల వారీగా అమలు చేసిన పనులను జాబితా చేస్తున్నారు.

బిజెపి ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, తెలంగాణ పట్ల వివక్ష, అదానీ తరహ వ్యక్తుల గురించి పార్టీ కార్యకర్తలకు వివరించాలని ఆలోచన. అదే సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇన్నాళ్లూ చేసిన మంచి పనులను ప్రచారం చేయడంపై దృష్టి సారించామని ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి తెలిపారు.

ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బిజెపి, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రభుత్వం పై వ్యతిరేక‌ ప్రచారం చేస్తుండటంతో , బిఆర్‌ఎస్ నాయకులు, ముఖ్యంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఇప్పుడు కాషాయ పార్టీని తమ‌దైన శైలిలో ఎదుర్కోవడానికి కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు.

''రాజకీయాలు ప్రతిపక్షాలకు ఆట, బీఆర్‌ఎస్‌కు పని'' అనే సీఎం కేసీఆర్ అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పడమే కాకుండా సోషల్ మీడియాలో వాస్తవాలు, గణాంకాలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తప్పుడు ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నామని సుధీర్‌రెడ్డి అన్నారు.

First Published:  2 April 2023 3:23 AM GMT
Next Story