Telugu Global
Telangana

తెలంగాణ మీ-సేవపై బెంగాల్ ప్రభుత్వం ఆసక్తి..?

బెంగాల్ ప్రభుత్వ ప్రతినిధులు ఇటీవల హైదరాబాద్‌లోని టీఎస్‌టీఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ పి. జగన్మోహన్ రావు వారికి 'మీ-సేవ' ద్వారా లభిస్తున్న సేవలను వివరించారు.

తెలంగాణ మీ-సేవపై బెంగాల్ ప్రభుత్వం ఆసక్తి..?
X

తెలంగాణలో ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తున్న 'మీ-సేవ'పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోంది. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ (టీఎస్‌టీఎస్) డెవలప్ చేసిన మీ-సేవను తమ రాష్ట్రంలో కూడా ఉపయోగించుకునేందుకు బెంగాల్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. బెంగాల్ ప్రభుత్వ ప్రతినిధులు ఇటీవల హైదరాబాద్‌లోని టీఎస్‌టీఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ పి. జగన్మోహన్ రావు వారికి 'మీ-సేవ' ద్వారా లభిస్తున్న సేవలను వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలు 'మీ-సేవ'ను ఉపయోగిస్తున్నాయి. కొంతకాలం క్రితం మీ-సేవ 2.0ను టీఎస్‌టీఎస్ అభివృద్ధి చేసింది. కేవలం వెబ్ బేస్డ్ మాత్రమే కాకుండా యాప్ ద్వారా కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు జగన్మోహ‌న్‌రావు తెలిపారు.

ఉమ్మడి ఏపీలో 2011లో ఈ-సేవ పేరుతో ప్రభుత్వం ప్రజలకు పలు సేవలను అందుబాటులోకి తెచ్చింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలోని 31 జిల్లాల్లో 4,758 కేంద్రాల ద్వారా ప్రజలకు పలు సేవలు అందిస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సేవలు కూడా మీ-సేవ ద్వారా అందిస్తున్నారు. మీ-సేవ 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత యాప్ ద్వారా 180 సర్వీసులు లభిస్తున్నాయి. వీటిలో ఆర్టీఏ సర్వీసులు, ఫీ, బిల్ పేమెంట్లు వంటివి అందిస్తున్నారు.

2018లో మీ-సేవ 2.0ను మినిస్టర్ కేటీఆర్ ప్రారంభించిన తర్వాత.. ఇప్పటి వరకు దాదాపు 7.5 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రజలకు అందించే పలు సేవల ద్వారా వచ్చే లాభంలో 90 శాతం మీ-సేవ ఆపరేటర్లకు చెల్లిస్తున్నారు. ఇది సక్సెస్ ఫుల్ కావడంతోనే బెంగాల్ ప్రభుత్వం తమకు కూడా ఈ టెక్నాలజీ అందించాలని కోరింది.

మీ-సేవ 2.0 సాఫ్ట్‌వేర్, వెబ్ పోర్టల్ డెవలప్‌మెంట్ ద్వారా రాష్ట్రానికి కూడా ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ-గవర్నెన్స్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మీ-సేవ 2.0 సరిగ్గా సరిపోతుంది. అందుకే ఇతర రాష్ట్రాలు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. త్వరలోనే బెంగాల్ ప్రభుత్వం, టీఎస్‌టీఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నది.

First Published:  12 Aug 2022 10:38 AM GMT
Next Story