Telugu Global
Telangana

తెలంగాణలో రూ.3,000-5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న వెల్స్పన్ గ్రూప్..స్వాగతించిన కేటీఆర్

బుధవారం వెల్‌స్పన్ గ్రూప్ టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, తెలంగాణలో కంపెనీ కార్యకలాపాల విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ, పారిశ్రామిక అభివృద్ధిలో తలెత్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, స్థానిక యువతకు ఉపాధి కల్పించేట్టు చూడాలని స్థానిక నాయకులను కేటీఆర్ కోరారు.

తెలంగాణలో రూ.3,000-5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న వెల్స్పన్ గ్రూప్..స్వాగతించిన కేటీఆర్
X

తెలంగాణలోవివిధ రంగాల్లో పారిశ్రామిక యూనిట్లను నెలకొల్పేందుకు రూ. 3,000 కోట్లు-రూ. 5,000 కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్‌స్పన్ గ్రూప్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు.

రంగారెడ్డి జిల్లాలోని చందన్‌వెల్లిలో వెల్‌స్పన్‌ గ్రూప్‌ అత్యాధునిక టెక్స్‌టైల్‌ పార్క్‌ను నెలకొల్పేందుకు ఇంతకు ముందే రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ప్రకటించిన పెట్టుబడి దీనికి అదనం.

బుధవారం వెల్‌స్పన్ గ్రూప్ టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, తెలంగాణలో కంపెనీ కార్యకలాపాల విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ, పారిశ్రామిక అభివృద్ధిలో తలెత్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, స్థానిక యువతకు ఉపాధి కల్పించేట్టు చూడాలని స్థానిక నాయకులను కేటీఆర్ కోరారు.

వెల్‌స్పన్ గ్రూప్, ఇతర పారిశ్రామిక దిగ్గజాల రాకతో చందన్‌వెల్లి , సీతారాంపూర్ ప్రాంతం త్వరలో తెలంగాణలో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా అవతరించనుందని ఆయన అన్నారు.

స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకోవాలని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం కింద స్థానిక అవసరాలను గుర్తించాలని కేటీఆర్ వెల్స్పన్ గ్రూప్‌ను అభ్యర్థించారు.

వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బాలక్రిషన్ గోయెంకా అభ్యర్థన మేరకు, శంషాబాద్ విమానాశ్రయం నుండి చందనవెల్లి వరకు రోడ్డు విస్తరణ చేపట్టి, నాలుగు లేన్ల రహదారిని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

దేశంలోనే అత్యుత్తమ నాణ్యతతో రాష్ట్రంలో ఉత్పత్తి చేసే పత్తిని ప్యాకేజింగ్ చేయడం, బ్రాండింగ్ చేయడం కోసం రైతులను కలుపుకొని ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని ఆయన ప్రకటించారు.

ఈ ప్రాంతంలో నెలకొల్పిన పరిశ్రమల్లో ఉపాధి పొందే యువత, మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు చందనవెల్లిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ సూచించారు.

First Published:  22 Feb 2023 2:22 PM GMT
Next Story