Telugu Global
Telangana

సంక్షేమ పథకాలు ఓట్ల కోసం కాదు ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం... కేసీఆర్

తెలంగాణ జీఎస్డీపీ 4 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్లకు పెరిగింది. మన స్థాయిలో కేంద్రం కూడా పని చేసి ఉంటే మన జీఎస్డీపీ 14.5 లక్షల కోట్లు ఉంటుండేది. విద్యుత్తు వినియోగంలో దేశంలో నెంబర్ 1గా ఎదిగాం. ఇవన్నీ చేయగలిగామంటే కారణం సమిష్టి కృషి అని కేసీఆర్ అన్నారు.

సంక్షేమ పథకాలు ఓట్ల కోసం కాదు ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం... కేసీఆర్
X

రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఓట్ల రాజకీయాల కోస‍ం చేయడం లేదని, దాని వెనక ఒక గొప్ప ఫిలాసఫీ ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జ‌గిత్యాల జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌సంగించారు.

''నూత‌న క‌లెక్ట‌రేట్‌ల‌లో ఇది 14వ క‌లెక్ట‌రేట్‌. మిగ‌తావికి కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం చేసుకోబోతున్నాం. తెలంగాణ ఉద్య‌మ సంద‌ర్భంలో అనేక‌సార్లు మీ వ‌ద్ద‌కు వ‌చ్చాను. తెలంగాణ ఏర్ప‌డుతుందని, ఇది ధ‌నిక రాష్ట్రం అవుతుందని ఆనాడే చెప్పాను. ఉద్యోగులకు అత్యుత్తమ జీతాలు వ‌స్తాయ‌ని చెప్పాను. అది నిజ‌మైంది. ఎవ‌ర్నీ వ‌ద‌ల‌కుండా అన్ని వ‌ర్గాలకు మేలు జ‌రిగే విధంగా కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నాం'' అని కేసీఆర్ అన్నారు.

రాష్ట్రం ఏర్ప‌డ‌ప్పుడు అనిశ్చిత స్థితి. క‌రెంట్ బాధ‌లు, సాగునీళ్లు లేవు. వ‌ల‌స‌లు, క‌రువు. కారు చీక‌ట్ల‌లాంటి ప‌రిస్థితి. కానీ అన్ని స‌మ‌స్య‌ల‌ను అన‌తి కాలంలోనే అధిగ‌మించామ‌ని చెప్పారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు రూ. 62 వేల కోట్ల బడ్జెట్ ఉంటే.. ఈసారి రూ. 2 ల‌క్ష‌ల 20 వేల కోట్లు దాటిపోనుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

''తెలంగాణ జీఎస్డీపీ 4 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్లకు పెరిగింది. మన స్థాయిలో కేంద్రం కూడా పని చేసి ఉంటే మన జీఎస్డీపీ 14.5 లక్షల కోట్లు ఉంటుండేది. విద్యుత్తు వినియోగంలో దేశంలో నెంబర్ 1గా ఎదిగాం. ఇవన్నీ చేయగలిగామంటే కారణం సమిష్టి కృషి. అగమ్య గోచరంగా ఉన్న తెల౦గాణ, కరువులతో, కరెంటు కోతలతో, రోదనలతో, ఆవేదనలతో ఉన్న తెలంగాణ ఈ రోజు దేశానికే ఆదర్శవంతంగా నిలిచిందంటే, గురుకుల విద్యలో మనకు మన‌మే సాటి అవగలిగామంటే, కేంద్రం సహకరించకపోయినప్పటికీ 33 జిల్లాల్లో 33 వైద్య కాలేజీలు ఏర్పాటు చేయగల్గుతున్నామంటే అదంతా మనందరి సమిష్టి కృషికి నిదర్శనం.'' అని కేసీఆర్ పేర్కొన్నారు.

''రైతు బంధు గురించి కొంత మంది విమర్శలు చేస్తూ ఉంటారు. 5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్నవారికి ఇవ్వొద్దని కొందరు అంటూ ఉన్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో 93 శాతం రైతులు5 ఎకరాల లోపు భూమి ఉన్నవారే. అందువల్లే అందరికీ రైతు బంధు ఇస్తున్నాం. గతంలో సాగు నీటి సౌకర్యంలేక, పెట్టుబడి లేకపోవడం వల్ల రైతులు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. వ్యవసాయం ఛిన్నాభిన్నం అయ్యింది. ఇప్పుడు సాగునీటి సౌకర్యాలు, రైతు బంధు వల్ల వ్యవసాయం అభివృద్ది చెందింది. 3కోట్ల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నాం. కూర గాయలు పండిస్తున్నాం. రైతుకు ఇప్పుడు ధీమా వచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ జరిగింది. దాంతో రాష్ట్ర‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ది చెందింది'' అని కేసీఆర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముందు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి జగిత్యాల జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

First Published:  7 Dec 2022 10:06 AM GMT
Next Story