Telugu Global
Telangana

ఎవరైనా కోరితే ఊర్లలో మేమే 'బలగం' సినిమా ప్రదర్శిస్తాం : దిల్ రాజు

ఈ సినిమా చూసి.. కుటుంబాలు కలుస్తుంటే మా జన్మలు ధన్యమవుతున్నాయి. మా ద్వారా సొసైటీలో చిన్న మార్పు వస్తుందంటే.. అంతకంటే గొప్ప ఇంకేమీ ఉండదని దిల్ రాజు అన్నారు.

ఎవరైనా కోరితే ఊర్లలో మేమే బలగం సినిమా ప్రదర్శిస్తాం : దిల్ రాజు
X

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'బలగం'. ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా, ఓటీటీలో రిలీజ్ అయ్యాక ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తెలంగాణ ప్రాంతంలో అయితే ఈ సినిమాను పూర్తిగా ఓన్ చేసుకున్నారు. ఊర్లలో స్క్రీన్స్ పెట్టి ప్రదర్శిస్తున్నారు. గతం ఎన్నడూ చూడని విధంగా గ్రామమంతా ఒక చోటు కూర్చొని సినిమాను చూసి కంట తడి పెట్టుకుంటున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి కొంత మంది పైరసీ చేశారని, అమెజాన్ ప్రైమ్ నుంచి డౌన్ లోడ్ చేసి.. అక్రమంగా పంపిణీ చేస్తున్నారని దిల్ రాజు ప్రొడక్షన్స్ మేనేజర్ నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో దిల్ రాజుపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరంతా కలిసి ప్రదర్శన ఏర్పాటు చేసుకుంటే ఏమయ్యింది? ఇన్నాళ్లు సంపాదించిన డబ్బు సరపోలేదా అని వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో మంగళవారం దిల్ రాజు, 'బలగం' చిత్ర యూనిట్‌తో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు.

ప్రేక్షకులు ఏ రకంగా అయినా ఈ సినిమాను చూడాలనేది మా కోరిక. సినిమా పూర్తయ్యాక.. మా ఊరిలో షో వేశాము. ఆ రోజే మంచి సినిమా తీశామని అనుకున్నాము. కానీ ఇంత గొప్ప సినిమా అవుతుందని ఊహించలేదని దిల్ రాజు అన్నారు. ఆ రోజే ఈ సినిమా ప్రేక్షకులందరి దగ్గరకి వెళ్లాలని అనుకున్నాను. థియేటర్, ఓటీటీ, టీవీల ద్వారా చూడాలని భావించాను. కానీ, మేము ఊహించని విధంగా నాలుగో ఆప్షన్ వచ్చింది. ఊర్లో పరదాలు కట్టి (స్క్రీన్స్) ఇలా షోలు వేస్తరని మేము ఊహించలేదు. ఇది మాకే షాకింగ్‌గా ఉందన్నారు. జరుగుతున్న ఈ సంఘనలను మేము ఆపలేము. మేం ఓపెన్‌గా చెప్తున్నాం.. ఈ సినిమా ఎక్కడా ఆగదని రాజు స్పష్టం చేశారు.

ఈ సినిమా చూసి.. కుటుంబాలు కలుస్తుంటే మా జన్మలు ధన్యమవుతున్నాయి. మా ద్వారా సొసైటీలో చిన్న మార్పు వస్తుందంటే.. అంతకంటే గొప్ప ఇంకేమీ ఉండదు. నాకు డబ్బు ముఖ్యం కాదు. వ్యాపారపరంగా డబ్బు కోసమే చేస్తాం. కానీ ఈ సినిమాను ఆపుతున్నాము, లీగల్ చర్యలు తీసుకుంటున్నాము అనే ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే మాకు లీగల్‌గా కొన్ని ప్రాబ్లెమ్స్ ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవాలని దిల్ రాజు అన్నారు. సినిమా తీసిన తర్వాత నిర్మాతగా దాన్ని ఓటీటీకి రైట్స్ ఇచ్చాము. ఇప్పుడు ఊర్లలో బహిరంగంగా ప్రదర్శిస్తుంటే ఓటీటీ నుంచి ఒత్తిడి వస్తోంది. ప్రైమ్ వీడియో వాళ్లు మాకు ఒక మెయిల్ చేశారు. ఫ్యూచర్‌లో మొత్తం ఇలాగే ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే మా రెవెన్యూ తగ్గిపోతుందేమో అని ప్రైమ్ వీడియో భయపడింది. అందుకే మా లీగల్ టీమ్ ఒక స్టెప్ తీసుకుంది అని దిల్ రాజు అన్నారు.

ఇప్పుడు ఈ సినిమా బహిరంగ ప్రదర్శనలను ఆపాలనే ఆలోచన వచ్చినా ఆగేది కాదు. ఎక్కడా కూడా సినిమాను ఆపము. ఓపెన్‌గా ఎవరు, ఎక్కడ, ఎలా చూడాలనుకుంటే అక్కడ చూడవచ్చని దిల్ రాజు స్పష్టం చేశారు. ఎవరికైనా ఈ సినిమా చూడాలని అనిపిస్తే మేమే స్వయంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాము. మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. దానికి ఫోన్ చేస్తే మేమే వచ్చి ఊరిలో సినిమాను ప్రదర్శిస్తామని దిల్ రాజు స్పష్టం చేశారు.

నా ఇరవై ఏళ్ల కెరీర్‌లో బలగం ఒక గొప్ప మైలు రాయి. బొమ్మరిల్లు సినిమా తర్వాత ఎంతో మంది ఓన్ చేసుకున్నారు. బొమ్మరిల్లు ఫాదర్ అనీ, మదర్ అనీ చాలా రోజులు మాట్లాడుకున్నారు. ఆనాడు చాలా మంది తండ్రులు తమ ప్రవర్తన మార్చుకోవడానికి సినిమా ఉపయోగపడింది. దాని తర్వాత బలగం అలాంటి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా చూసి ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్లు చేశారు. అసలు ఊరంతా కదిలి ఇలా ప్రొజెక్టర్లు పెట్టుకొని సినిమా చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది.

చిన్నప్పుడు 9వ తరగతిలో ఉన్నప్పుడే ఇలా పరదాలు కట్టి సినిమాలు ప్రదర్శించాను. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అలాంటి కల్చర్ చూస్తుంటే నాకు ఆనందం వేసింది. ఈ సినిమా చూసి అన్నదమ్ములు కలిసిపోయారు, విడిపోయిన కుటుంబాలు కలిసిపోతున్నాయి అని చెప్పినప్పుడు చాలా చాలా సంతోషం వేసింది. నిజంగా ఇంత గొప్ప సినిమా తీసినందుకు చాలా గర్వపడుతున్నానని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

First Published:  5 April 2023 1:23 AM GMT
Next Story