Telugu Global
Telangana

అధికారంలోకి రాగానే భైంసా పేరు మార్చేస్తాం.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పేరు మార్పు వ్యాఖ్యలు చేశారు. గతంలోనే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు భైంసా పేరును మహీషగా మారుస్తామని ప్రకటించారు.

అధికారంలోకి రాగానే భైంసా పేరు మార్చేస్తాం.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
X

ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం.. ఉద్యోగాలు ఇస్తాం.. ప్రాజెక్టులు నిర్మిస్తాం అంటూ హామీలు ఇస్తారు. ఇక మత రాజకీయాలు చేసే బీజేపీ.. మొదట్లో రామ మందిరం పేరుతో ఓట్లు దండుకున్నది. ఆ వివాదం పరిష్కారం కావడంతో ఇప్పుడు ఏ ఊరికి వెళ్లినా పేర్లు మారుస్తామంటూ నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. పేరు మార్చడం వల్ల ఆ ప్రాంతానికి, నగరానికి, పట్టణానికి వచ్చే లబ్ది ఏంటో చెప్పదు. కానీ, పేరు మార్పు ఉద్వేగాలను మాత్రం రెచ్చగొడుతూ ఉంటుంది.

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పేరు మార్పు వ్యాఖ్యలు చేశారు. గతంలో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు భైంసా పేరును మహీషగా మారుస్తామని ప్రకటించారు. ప్రజా సంగ్రామ యాత్రను నిర్మల్ జిల్లాలో ప్రారంభించారు. హైకోర్టు షరతుల మేరకు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఓ జిన్నింగ్ మిల్లులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

ఇవ్వాళ మీ ప్రభుత్వం ఉండొచ్చు.. కానీ రేపు మా ప్రభుత్వం వస్తుంది. బీజేపీ అధికారంలోకి రాగానే భైంసా పేరును మహీషగా మారుస్తామని చెప్పారు. అంతే కాకుండా ఆ పట్టణాన్ని తాను దత్తత తీసుకుంటానని వెల్లడించారు. భైంసాకు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా..? మనం ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నామని ఆయన ప్రశ్నించారు. భైంసా ప్రజలకు భరోసా కల్పించడానికే తాను ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.

కాషాయ పార్టీ అధికారంలోకి రాగానే హిందూ వాహిని కార్యకర్తలపై పెట్టిన పీడీ యాక్ట్‌లు తొలగిస్తాం, వారిపై ఉన్న కేసులు ఎత్తేస్తామని చెప్పారు. వారికి ఉద్యోగాలు ఇచ్చి గౌరవిస్తామని హామీ ఇచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఎం నేతలు ఎక్కడికైనా వెళ్లొచ్చు కానీ, ధర్మం కోసం పాటు పడే బీజేపీ నేతలపై మాత్రం ఆంక్షలు విధిస్తారా అని బండి మండిపడ్డారు. ఎంఐఎం గడ్డపై కమలం జెండాను ఎగురవేసే పార్టీ బీజేపీ మాత్రమే అని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్న బీజేపీని నిషేధిస్తారా అని ప్రశ్నించారు.

First Published:  29 Nov 2022 2:48 PM GMT
Next Story