Telugu Global
Telangana

'రఘురామ కృష్ణంరాజును ఎలా కాపాడుతున్నామో.. అలాంటి సెక్యూరిటీనే ఉంటుంది'

టీఆర్ఎస్‌ను వీడి పైలెట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరతారని.. కానీ ఆయనకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని రామచంద్ర భారతితో సింహయాజులు మాట్లాడారు.

రఘురామ కృష్ణంరాజును ఎలా కాపాడుతున్నామో.. అలాంటి సెక్యూరిటీనే ఉంటుంది
X

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అంత ధీమాగా ఉండటానికి కేంద్రంలోని బీజేపీ అండే కారణమని మరో సారి రుజువైంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎంత సహకరిస్తున్నా.. బీజేపీ మాత్రం కుట్రలు చేస్తూనే ఉన్నది. పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న రఘురామపై కఠిన చర్యలు తీసుకోవాలని అనుకున్నా.. అతడికి కేంద్రం నుంచి సపోర్ట్ ఉండటంతో వైసీపీ కూడా వెనకడుగు వేస్తోంది. తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో బయటపడిన మూడో ఆడియో క్లిప్‌లో రఘురామకు సంబంధించిన చర్చ కూడా జరిగింది.

టీఆర్ఎస్‌ను వీడి పైలెట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరతారని.. కానీ ఆయనకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని రామచంద్ర భారతితో సింహయాజులు మాట్లాడారు. పైలెట్ రక్షణ విషయంలో నందకుమార్ ఆందోళన వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చారు. అయితే, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని.. కేంద్ర బలగాలతో రక్షణ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎంపీ రఘురామ కృష్ణం రాజును ఎలా కాపాడుతున్నామో.. అలాంటి సెక్యూరిటీ పార్టీలో చేరే వారికి ఉంటుందని రామ చంద్ర భారతి స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులతో కాకుండా సెంట్రల్ ఫోర్సెస్ వారి బాధ్యతను తీసుకుంటాయని అన్నారు.

26వ తేదీన హైదరాబాద్ వచ్చి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. తుషార్ కూడా వస్తారని రామచంద్ర భారతి చెప్పారు. అక్కడ చర్చలు ముగిసిన తర్వాత చార్టర్ ఫ్లైట్‌లో ఢిల్లీకి వెళ్దామని అన్నారు. నందకుమార్‌కి కూడా రక్షణ ఉంటుందని చెప్పారు. ఆయనకు కూడా సెంట్రల్ ప్రొటెక్షన్ ఇప్పిస్తానని స్పష్టం చేశారు. ఈ మూడు ఆడియోలు వింటే.. ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించిన వ్యవహారాలు ఎంత పకడ్బంధీగా సాగాయో.. ఆ తర్వాత పరిణామాలకు ఎలాంటి వ్యూహం అనుసరించాలని అనుకుంటున్నారో కూడా స్పష్టంగా అర్థం అవుతోంది.

First Published:  28 Oct 2022 12:49 PM GMT
Next Story