Telugu Global
Telangana

డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తాం.. ఇది టైగర్ తెలంగాణ - కేసీఆర్

రైతుబంధు అడిగిన వారిని చెప్పుతో కొడతామన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపైనా ఫైర్ అయ్యారు కేసీఆర్. కళ్లు నెత్తికెక్కాయ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తాం.. ఇది టైగర్ తెలంగాణ - కేసీఆర్
X

కట్టే కాలే వరకు తెలంగాణ కోసం పోరాడతానన్నారు గులాబీ బాస్ కేసీఆర్‌. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత న‌ల్ల‌గొండ జిల్లాలో బీఆర్ఎస్ తొలి బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. ఈ సభకు కేసీఆర్‌ హాజరయ్యారు. కృష్ణా ప్రాజెక్టులకు KRMBకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన కేసీఆర్.. కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇది రాజకీయ సభ కాదని.. ఉద్యమ, పోరాట సభ అని చెప్పుకొచ్చారు. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకే లేదన్నారు కేసీఆర్. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఫ్లోరైడ్ సమస్య తీరిందన్నారు. నల్గొండ ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారిందన్నారు.

తెలంగాణ నీళ్లు దొంగతనం చేయాలనుకుంటున్న వారికి ఈ సభ ఓ హెచ్చరిక అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో నిమిషం కరెంటు పోకుండా ఇచ్చామన్నారు. గతంలో లేని నీళ్లు ఇప్పుడు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. దానికి దమ్ము, చేసే ఆరాటం ఉండాలన్నారు. గతంలో ఆముదాలు మాత్రమే పండిన నల్ల‌గొండ జిల్లాలో లక్షల టన్నుల వడ్లు పండేలా కృషి చేశామన్నారు.

దమ్ముంటే బీఆర్ఎస్‌ కంటే గొప్పగా ప‌రిపాల‌న‌ చేసి చూపించాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు కేసీఆర్. అసెంబ్లీ అయ్యాక తాము కూడా మేడిగడ్డకు వెళ్తామన్నారు. ఇప్పటికీ కూడా ప్రాణహితలో 5 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉందని.. దమ్ముంటే నీటిని ఎత్తిపోయాలని సూచించారు కేసీఆర్. కేసీఆర్‌ను బద్నాం చేయాలని.. పొలాలు ఎండబెడతారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదన్న కేసీఆర్.. ప్రాజెక్టులో 200 కి.మీ సొరంగాలు, 1500 కి.మీ కాల్వలు ఉంటాయన్నారు. రెండు మూడు పిల్లర్లు కుంగిపోయాయన్నది వాస్తవమేనన్నారు. గతంలో సాగర్‌లో కుంగలేదా అని ప్రశ్నించారు. ఇక రైతుబంధు అడిగిన వారిని చెప్పుతో కొడతామన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపైనా ఫైర్ అయ్యారు కేసీఆర్. కళ్లు నెత్తికెక్కాయ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కూడా చెప్పులు ఉంటాయని..వాటితో కొడితే మూడు పళ్లు రాలిపోతాయన్నారు.

తెలంగాణ కోసం కట్టె కాలే వరకు కొట్లాడతానన్నారు కేసీఆర్. తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలా కొట్లాడతాను తప్ప.. పిల్లిలా ఉండనంటూ కామెంట్స్ చేశారు. ఛ‌లో న‌ల్ల‌గొండ సభకు పిలుపు ఇవ్వగానే కాంగ్రెస్ నేతలు కాళ్లు, చేతులు పిసుక్కుంటున్నారని.. ఆగమేఘాల మీద KRMBకి ప్రాజెక్టులు అప్పగించేది లేదంటూ తీర్మానాలు చేశారన్నారు కేసీఆర్. మళ్లీ డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

First Published:  13 Feb 2024 5:34 PM GMT
Next Story