Telugu Global
Telangana

జై శ్రీరామ్ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి వస్తే 100 రామమందిరాలు కడతామన్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ 'జై శ్రీరామ్' నినాదాన్ని ఎత్తుకున్నది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏకంగా 100 రామ మందిరాలు కట్టిస్తామని హామీ గుప్పించారు. అధికారంలోకి వస్తే 100 నియోజకవర్గాల్లో ఒక్కోటి రూ.10 కోట్ల ఖర్చుతో 100 ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు.

జై శ్రీరామ్ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి వస్తే 100 రామమందిరాలు కడతామన్న రేవంత్ రెడ్డి
X

బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, అయోధ్య రామ మందిరాన్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ కూడా బీజేపీపై ఇలాంటి విమర్శలే చేశారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ 'జై శ్రీరామ్' నినాదాన్ని ఎత్తుకున్నది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏకంగా 100 రామ మందిరాలు కట్టిస్తాననే హామీ గుప్పించారు. బీజేపీ ఒకటి కట్టిస్తే.. తాను 100 నియోజకవర్గాల్లో ఒక్కోటి రూ.10 కోట్ల ఖర్చుతో 100 ఆలయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిర్మిస్తుందని చెప్పారు. భద్రాచలం పట్టణంలో తన యాత్ర చేరుకున్న సమయంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఈ వాగ్దానం చేయడం గమనార్హం.

కాగా, రేవంత్ యాత్ర ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో సాగుతోంది. ఈ సందర్భంగా మరో సారి రామ మందిరాల హామీని ప్రజలకు చెప్పారు. 100 నియోజకవర్గాల్లో రామాలయాలు కట్టిస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాచలం గుడి అభివృద్ధికి రూ.100 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లూ మత రాజకీయాలు అని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ రాష్ట్రాధ్యక్షుడే ఇప్పుడు హిందువుల ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. గతంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి.. ఇప్పుడు బీజేపీ వైపు వెళ్లిపోయిన హిందూ ఓటర్లకు గాలం వేయడంలో భాగంగానే ఈ హామీ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగింది...

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం మునుపటి కంటే పెరిగిందని టీపీసీసీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి 28 శాతం ఓట్లుండగా.. ఇప్పుడు అది 30 శాతానికి పెరిగిందని చెప్పుకొచ్చారు. హాథ్‌ సే హాథ్ జోడో 'యాత్ర'లో భాగంగా ఆయన జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్‌కు 33 శాతం, బీజేపీకి 7 నుంచి 11 శాతం ఓటు బ్యాంకు ఉందని చెప్పారు.

తెలంగాణలో ఇప్పుడు రాజకీయంగా ఒక అస్పష్టమైన వాతావరణం నెలకొని ఉన్నదని.. ఏ సర్వే ఏజెన్సీ కూడా రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతోందో కచ్చితంగా అంచనా వేయలేవని అన్నారు. ఒక వేళ ఎవరైనా ఫలానా పార్టీ గెలుస్తుందని కనుక చెబితే.. అది వారి వ్యక్తిగత అభిప్రాయమే తప్ప.. ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయం కాదని అన్నారు. ఆ పార్టీ గెలుస్తుంది.. ఈ పార్టీ ఓడుతుందంటూ చర్చ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. ప్రజలు ఏ వైపు ఉన్నారనే అంశాలపై కొన్ని అంచనాలు వచ్చాయి. అంతే తప్ప ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంలో మాత్రం స్పష్టత లేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నది. అధికారంలోకి రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు పొత్తులపై చర్చించే ప్రసక్తే లేదని రేవంత్ అన్నారు. నేను ప్రజా క్షేత్రంలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాను. కానీ కొంత మంది నాయకులు ఏసీ గదుల్లో కూర్చొని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పరోక్షంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించారు.

ముందస్తు ఎన్నికలు వస్తాయా? అభ్యర్థులు ఎవరు అనే విషయాలు ఎవరికీ తెలియదని రేవంత్ చెప్పారు. పార్టీ అధిష్టానం అన్ని అంశాలను గమనిస్తోందని.. ప్రతీ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


First Published:  15 Feb 2023 12:01 PM GMT
Next Story