Telugu Global
Telangana

రేవంత్ రెడ్డిని సీఎం చేయాలి.. ఎల్లా హోటల్ వద్ద నినాదాలు

గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ గేటు దగ్గర కొంతమంది కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది.

రేవంత్ రెడ్డిని సీఎం చేయాలి.. ఎల్లా హోటల్ వద్ద నినాదాలు
X

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. కాకపోతే అది ఇంకా సీక్రెట్ గానే ఉంది. సీల్డ్ కవర్ లో ఆ వివరాలను డీకే శివకుమార్ తెలంగాణకు తెస్తున్నారు. అయితే ఇంతలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న ఎల్లా హోటల్ వద్ద హడావిడి మొదలైంది. రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.

తెలంగాణ సీఎంని ప్రకటించే క్రమంలో అందర్నీ బుజ్జగించి ఏకాభిప్రాయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ నిర్ణయం ఇంకా బయటకు రాలేదు. దీంతో రేవంత్ రెడ్డి అభిమానులు ఆందోళన చేస్తున్నారు. గచ్చిబౌలి లోని ఎల్లా హోటల్ గేటు దగ్గర కొంతమంది కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన కొంతమంది యువకులు ‘రేవంత్‌ రెడ్డి సీఎం’ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.

రేవంత్ పేరు ఖరారైందా..?

మరోవైపు కొన్ని మీడియా సంస్థలు రేవంత్ పేరు ఖరారైనట్టు వార్తలిస్తున్నాయి. స్వయానా రాహుల్ గాంధీ.. రేవంత్ పేరు ప్రకటించారని, జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది రేవంత్ పేరుని ప్రతిపాదించారని, అందుకే ఆయన్ను సీఎంగా అధిష్టానం ఎంపిక చేసిందని చెబుతున్నారు. ఈ సస్పెన్స్ కి మరి కాసేపట్లో తెరపడుతుంది.


First Published:  5 Dec 2023 11:38 AM GMT
Next Story