Telugu Global
Telangana

తెలంగాణ లాంటి అభివృద్ధి కావాలి.. మహారాష్ట్ర రైతుల బృందం వ్యాఖ్యలు

తెలంగాణ మాడల్ ఇప్పుడు దేశమంతటా అమలు చేయాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర రైతుల బృందం వ్యాఖ్యానించింది.

తెలంగాణ లాంటి అభివృద్ధి కావాలి.. మహారాష్ట్ర రైతుల బృందం వ్యాఖ్యలు
X

రైతులు బాగుండాలనే సీఎం కేసీఆర్ సంకల్పం చాలా గొప్పది. ఇక్కడ పథకాలు మహారాష్ట్రతో పాటు దేశమంతటా అమలు కావాలి. సీఎం కేసీఆర్‌తోనే ఇది సాధ్యమవుతుంది. దేశానికి ఆయన అవసరం ఉన్నది. తెలంగాణ మాడల్ ఇప్పుడు దేశమంతటా అమలు చేయాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర రైతుల బృందం వ్యాఖ్యానించింది. ఆ రాష్ట్రం నుంచి వచ్చిన 150 మంది రైతుల బృందం ఆదివారం సిద్దపేట జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా వారికి తెలంగాణలో నిర్మించిన భారీ ప్రాజెక్టుల వివరాలతో పాటు రైతులు, ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను మంత్రి హరీశ్ రావు వివరించారు.

నంగనూరు మండల ఘనపూర్ చెక్‌డ్యామ్‌ను మహారాష్ట్ర రైతులకు మంత్రి హరీశ్ రావు చూపించారు. కాళేశ్వరం జలాలతోనే ఈ చెక్ డ్యాం నింపినట్లు తెలిపారు. అక్కడే రైతులతో చాలా సేపు ముచ్చటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, అనుబంధ రిజర్వాయర్ల నిర్మాణానికి రాత్రులు, పగలు అనే తేడా లేకుండా పని చేసినట్లు చెప్పారు. మోటార్లను నాలుగైదు దేశాల నుంచి తెప్పించామన్నారు. నేడు తెలంగాణలో యాసంగిలో కూడా 56 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నదని వెల్లడించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపినా పర్వాలేదు.. కానీ రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు బంధు ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారని మంత్రి వివరించారు.

ఇక మహారాష్ట్ర రైతులు కూడా తమ అభిప్రాయాలు చెప్పారు. సిద్ధిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ పంప్ హౌస్, రిజర్వాయర్ లోని నీళ్లను రైతులు పరిశీలించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశసంసించారు. ప్రాజెక్టు విశేషాలను ఈఎన్సీ హరిరాం వివరించారు. ఈ పంప్‌హైస్ ద్వారా 1.25 లక్షల ఎకరాలకు, కొండపోచమ్మ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అన్నారు. గోదావరి నది ఎత్తుకు 600 మీటర్లు పైగా నీళ్లు తెచ్చి నిల్వ చేయడాన్ని రైతులు ఆశ్చర్యంగా పరిశీలించారు. మల్లన్నసాగర్ కట్టపై రైతులు సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిశీలించారు. అక్కడ కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కర్.. తుమ్ ఆగే బడో.. హమ్ తుమారే సాథ్ రహే అంటూ నినదించారు.

తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలు కనపడుతున్నాయి. ఎర్రటి ఎండల్లోనూ కాల్వలు, చెరువులు, చెక్ డ్యాముల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. మా రాష్ట్రంలో పుట్టిన గోదావరి నీళ్లు.. ఇక్కడ కాలువలు, వాగుల్లో చూస్తుంటే సంబురంగా ఉందని మహారాష్ట్ర రైతులు చెప్పారు. తెలంగాణ మొత్తాన్ని సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేశారంటూ రైతులు ప్రశంసించారు. తెలంగాణలో ఎక్కడ చూసినా పుష్కలంగా నీళ్లు ఉండటంతో రైతులు వ్యవసాయం చేసుకుంటున్న విధానంపై మహారాష్ట్ర రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని స్వయంగా చూడటంతో కడుపు నిండిందన్నారు. కేసీఆర్ సర్కార్ దేశంలో రావాలన్నదే మహారాష్ట్ర ప్రజల కోరికని అన్నారు.

తెలంగాణలో మంచి మనసున్న ముఖ్యమంత్రి ఉన్నారని.. మహారాష్ట్రలో అయితే రూ.12 వేలు చెల్లిస్తే కానీ కరెంట్ పోల్ ఇవ్వరని వాపోయారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో అధికారంలోకి రావడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్ారు. రైతుల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్.. అన్నదాతల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొని రావడంపై ఆనందం వ్యక్తం చేశారు.

First Published:  3 April 2023 1:58 AM GMT
Next Story