Telugu Global
Telangana

పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధికి రూ.15,690 కోట్లు ఖర్చు చేశాం... కేటీఆర్

పట్టణ ప్రగతి, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, సీఎం హామీలు, మిషన్‌ భగీరథ, స్టేట్‌ ఫైనాన్స్‌, ఇతరత్రా వివిధ పనుల కోసం పట్టణ స్థానిక సంస్థలలో రూ.15,690 కోట్లు ఖర్చు చేసిన‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని కేటీఆర్ తెలిపారు.

పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధికి రూ.15,690 కోట్లు ఖర్చు చేశాం... కేటీఆర్
X

రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా గ్రేటర్ హైదరాబాద్ లో కాక‌ 141 పట్టణ స్థానిక సంస్థలలో రూ.15,690 కోట్లు ఖర్చు చేసిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు.

పట్టణ ప్రగతి, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, సీఎం హామీలు, మిషన్‌ భగీరథ, స్టేట్‌ ఫైనాన్స్‌, ఇతరత్రా వివిధ పనుల కోసం పట్టణ స్థానిక సంస్థలలో రూ.15,690 కోట్లు ఖర్చు చేసిన‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని కేటీఆర్ తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ ఈ ఏడాది 26 అవార్డులను కైవసం చేసుకుందని, అదేవిధంగా డిసెంబర్ 2022 స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ఫోర్ స్టార్ కేటగిరీలో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయని తెలిపారు.

గురువారం పట్టణ ప్రగతి వర్క్ షాప్ లో కేటీఆర్ మాట్లాడుతూ, పట్టణ స్థానిక సంస్థలలో జరిగిన అభివృద్దికి ప్రధానంగా అధికారులు, ప్రత్యేకించి కమిషనర్లు, డైరెక్టర్ (మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్) ఎన్ సత్యనారాయణ కారణమని అభినందించారు.

''తెలంగాణ TS-bPASS ను ప్రవేశపెట్టింది. మరే రాష్ట్రం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టలేదు. ఈ బిల్డింగ్ అప్రూవల్ సిస్టమ్‌ను ప్రారంభించినప్పటి నుండి, 1.70 లక్షల దరఖాస్తులు (హైదరాబాద్ కాకుండా) వచ్చాయి. ప్రాసెస్ కూడా చేయబడ్డాయి.'' అని కేటీఆర్ తెలిపారు.

"మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని తీసుకురాలేదు, ఇది పౌరులకు పారదర్శక పద్ధతిలో బిల్డింగ్ ప్లాన్ ఆమోదం పొందడంలో సహాయపడుతుంది" అని మంత్రి చెప్పారు.

టీఎస్-బీపాస్‌పై స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులతో చర్చించి సమస్యలుంటే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లకు మంత్రి ప్రత్యేకంగా సూచించారు.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ (MAUD) విభాగం 10-పాయింట్ల కార్యక్రమంలో, TS-bPASS మొదటి స్థానంలో ఉందని మంత్రి చెప్పారు. ''సిస్టమ్‌లో ఏవైనా లొసుగులు ఉంటే వాటిని పరిష్కరించండి. TS-bPASS లాగా, పౌరులకు మంచి సేవను అందించడంలో సహాయపడడానికి మున్సిపల్ చట్టంలో ఏవైనా సవరణలను సూచించండి'' అని కేటీఆర్ అధికారులను కోరారు.

తెలంగాణ MAUDని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మార్చడమే నా లక్ష్యం అని ఆయన‌ అన్నారు.

First Published:  5 Jan 2023 11:31 AM GMT
Next Story