Telugu Global
Telangana

రూపాయి ఇస్తున్నాం.. 46 పైసలే తీసుకుంటున్నాం.. థ్యాంక్స్ తెలంగాణ బ్యానర్లు కట్టండి

''థ్యాంక్స్ టూ తెలంగాణ'' అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రేషన్ దుకాణాల దగ్గర బ్యానర్లు కట్టాల్సిన సమయం వచ్చింది మేడం అంటూ నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

రూపాయి ఇస్తున్నాం.. 46 పైసలే తీసుకుంటున్నాం.. థ్యాంక్స్ తెలంగాణ బ్యానర్లు కట్టండి
X

నచ్చింది ప్రచారం చేద్దాం.. నమ్మినోడు నమ్ముతాడు అన్న బీజేపీ ఆలోచన తెలంగాణలో బెడిసికొడుతోంది. తెలంగాణ పర్యటన అంటే నిజాలే చెప్పాలి.. అవాస్తవాలు మాట్లాడితే పరువు పోవడం తప్ప మరో ఉపయోగం లేదన్న భావనను కేంద్ర మంత్రుల్లో తెలంగాణ మంత్రులు సృష్టించారు. బియ్యం డబ్బులు మావే, ఆయూష్మాన్ భారత్ నిధులు మావే అంటూ ప్రచారం చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అదే ఆర్థిక గణాంకాలతో సూటిగా కౌంటర్‌గా ఇచ్చారు కేటీఆర్.


తెలంగాణ నుంచి కేంద్రప్రభుత్వానికి 2014 నుంచి ఏ ఏడాది ఎంత నిధులు వెళ్లాయి.. తిరిగి కేంద్రం నుంచి తెలంగాణకు ఎంత సొమ్ము వచ్చింది అన్నది వివరిస్తూ కేటీఆర్‌ ఒక పట్టికను ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వాన్ని దాతగా కేంద్ర ఆర్థిక మంత్రి కీర్తిస్తున్నారు గానీ.. అసలు నిజాలు ఇవీ అంటూ కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి రూపాయి ఇస్తుంటే.. తిరిగి కేంద్రం నుంచి తెలంగాణకు 46 పైసలు మాత్రమే అందుతోందని కేటీఆర్‌ వెల్లడించారు. దేశానికి తెలంగాణ రాష్ట్రమే నిధులు అందిస్తోందన్నారు. ''థ్యాంక్స్ టూ తెలంగాణ'' అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రేషన్ దుకాణాల దగ్గర బ్యానర్లు కట్టాల్సిన సమయం వచ్చింది మేడం అంటూ నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ నుంచి కేంద్రానికి 3 లక్షల 65వేల కోట్లు వెళ్లాయి. కేంద్రం నుంచి తెలంగాణకు అందింది మాత్రం లక్షా 97వేల కోట్లే. ''హ్యాండ్ బుక్ ఆఫ్‌ స్టాటిస్టిక్స్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ 2020-21'' ప్రకారం దేశానికే భారీగా నిధులు సమకూర్చి పెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.

First Published:  4 Sep 2022 1:53 AM GMT
Next Story