Telugu Global
Telangana

దళిత పారిశ్రామికవేత్తలు ఎదగడానికి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నాము : మంత్రి కేటీఆర్

తెలంగాణ ఈ రోజు ఆచరించేదే.. రేపు దేశం అనుసరిస్తుందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని పథకాలను కాపీ కొడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

దళిత పారిశ్రామికవేత్తలు ఎదగడానికి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నాము : మంత్రి కేటీఆర్
X

తెలంగాణలోని దళిత పారిశ్రామికవేత్తలు దేశానికే ఆదర్శంగా ఎదగాలనే లక్ష్యంతో వారికి అవసరమైన ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రభుత్వం ఇస్తోందని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దళితులు ఆర్థికంగా ఎదుగుతుంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవల్సి వస్తోందని ఆయన ఆవేదన చెందారు. రాష్ట్రంలో సామాన్య దళితులు పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన తోడ్పాటును ప్రభుత్వం కేసీఆర్‌ అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఈ రోజు ఆచరించేదే.. రేపు దేశం అనుసరిస్తుందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని పథకాలను కాపీ కొడుతోందని అన్నారు. రైతు బంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను కేంద్రం ఇలాగే కాపీ కొట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వ‌చ్చింద‌న్నారు. అందరికీ ఓటు హక్కు ఉండాలని, ముందు చూపుతోనే పురుషులకు సమానంగా మహిళలకు ఓటు హక్కును కల్పించిన ఘనత అంబేద్కర్‌దే అని ప్రశంసించారు.

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతమే తమకు ఆదర్శమని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. దళిత బంధు వంటి పథకాలను ప్రవేశపెట్టాలంటే సీఎం కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడికే సాధ్యమని కేటీఆర్ అన్నారు. దళిత బంధు పథకం ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నిండాయని, ఇప్పుడు వారందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని చెప్పారు.

దళిత బంధు యూనిట్లు ఎంత విజయవంతంగా నడుస్తున్నాయో అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని కేటీఆర్ కోరారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు ఎవరూ ఊహించనంతగా పెరిగాయన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత భూముల ధరలు కూడా పెరిగాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని కేవలం నాలుగేళ్లలోనే పూర్తి చేసుకున్నామని అన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఒక నదినే మలిపామని చెప్పారు.

కాళేశ్వరం వంటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయని.. ఇవ్వాళ రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతుంటే ప్రతిపక్షాలకు కనపడటం లేదని విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. సీఎం కేసీఆర్ మొండిగా ముందుకు వెళ్లి ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్పారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని.. కుల, మత భేదాలు చూపకుండా అందరినీ కలుపుకొని పోతేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా టీ-ప్రైడ్ ద్వారా ప్రోత్సాహకాలు, అవార్టులను మంత్రి అందజేశారు.


First Published:  13 April 2023 9:23 AM GMT
Next Story