Telugu Global
Telangana

చలో మేడిగడ్డకు పోటీగా తెరపైకి పాలమూరు-రంగారెడ్డి

ఈరోజు తెలంగాణలో వాటర్ వార్ జరుగుతోంది. చలో మేడిగడ్డ అంటూ బీఆర్ఎస్ వెళ్తుంటే, చలో పాలమూరు-రంగారెడ్డి అంటూ కాంగ్రెస్ శ్రేణులు పోటీ కార్యక్రమానికి సిద్ధమయ్యాయి.

చలో మేడిగడ్డకు పోటీగా తెరపైకి పాలమూరు-రంగారెడ్డి
X

బీఆర్ఎస్ నేతలు ఈరోజు చలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పోటీగా కాంగ్రెస్ నేతలు చలో పాలమూరు-రంగారెడ్డి అంటూ సందడి మొదలు పెట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను సందర్శించేందుకు వెళ్లబోతున్నారు. అక్కడ జరిగిన పనులను పరిశీలించి గత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టేందుకు వారంతా రెడీ అయ్యారు. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వినపడుతున్నాయి.

చలో మేడిగడ్డపై ఉత్కంఠ..

హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం బీఆర్ఎస్ బృందం బయలుదేరుతుంది, మేడిగడ్డ వరకు యాత్రలా వెళ్తారు నేతలు. మేడిగడ్డ సందర్శన అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడతారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు బీఆర్ఎస్ పొలిటికల్ షో కి ప్రాధాన్యత తగ్గించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అయితే కాంగ్రెస్ నుంచి కీలక నేతలెవరూ చలో పాలమూరు-రంగారెడ్డికి రావడంలేదని సమాచారం. ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉన్న వంశీచందర్ రెడ్డితోపాటు, పాలమూరు జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి కాంగ్రెస్ హడావిడి ఏమేరకు విజయవంతం అవుతుందో చూడాలి.

పోటా పోటీ కార్యక్రమాలు..

గత నెలలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్.. పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తే, అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రాజెక్ట్ లను సందర్శించి గత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టాయి. మళ్లీ ఇప్పుడు ఒకేరోజు వాటర్ వార్ జరుగుతోంది. చలో మేడిగడ్డ అంటూ బీఆర్ఎస్ వెళ్తుంటే, చలో పాలమూరు-రంగారెడ్డి అంటూ కాంగ్రెస్ శ్రేణులు పోటీ కార్యక్రమానికి సిద్ధమయ్యాయి.

First Published:  1 March 2024 3:22 AM GMT
Next Story