Telugu Global
Telangana

కన్నెపల్లి పంప్‌హౌస్‌లోకి నీళ్ళు: ప్రకృతి ప్రకోపమా - మానవ తప్పిదమా ?

గోదావరి నదికి వరదలు రావడం కొత్తేమి కాదు. 1986లో రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయి. ప్రస్తుత కాలంలో వాతవరణంలో సంభవిస్తున్న పెను మార్పుల కారణంగా క్రమానుగతంగా లేని వర్షాలు ఎక్కువగా కుర‌వ‌డం వలన అసాధారణ వరదలు సంభవించాయి. ఈ ఆకస్మిక వరదలు తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు.

కన్నెపల్లి పంప్‌హౌస్‌లోకి నీళ్ళు: ప్రకృతి ప్రకోపమా - మానవ తప్పిదమా ?
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వర౦ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం. తెలంగాణలో సాగు, తాగు నీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. దేశ జల వనరుల విషయంలో అత్యంత కీలక భూమికను పోషించే కేంద్ర జల వనరుల సంఘం(CWC) ఈ ప్రాజెక్టు గురించి కితాబు ఇచ్చిన మాట విదితమే. కానీ ఇలాంటి భారీ స్థాయి ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్‌లోకి నీరెలా వచ్చింది అన్న విషయం ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా లోతైన శాస్రియ చర్చ అవసరం.

గోదావరి నది ప్రవాహ వ్యవస్థ పశ్చిమాన ఉన్న మహారాష్ట్రలో మొదలై తూర్పున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ముగుస్తుంది. తెలంగాణ మధ్యలో ఉంది. గోదావరి బేసిన్ అంతటా ఇటీవల ఎడతెరిపి లేకుండా వర్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో అసాధారణమైన వరదలు సంభవించాయి. కాలేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదల సామర్థ్యం కన్నా అధికంగా వరదలు సంభవించటం వలన పంప్‌హౌస్‌లోకి నీరు చేరింది. కన్నెపల్లి పంప్‌హౌస్ ముంపుకి గురైన సంఘటన జూలై 14న జరిగింది. దీనికి ప్రధానమైన కారణం అధిక వర్షపాతం వలన వచ్చిన ఆకస్మిక వరదలు. జూలై 14న రాష్ట్ర సరాసరి వర్షపాతం కన్నా 490 శాతం అధికంగా నమోదు అయింది. దానికి తోడు ముందు రోజుల్లో పడిన అతి భారీ వర్షాలు వరద ఉధృతిని మరియు పరిమాణాన్ని పెంచాయి.

CWC ఇచ్చిన హైడ్రాలజి క్లియరెన్స్ ప్రకారం, 1986లో గోదావరికి సంభవించిన రికార్డు స్థాయి వరదలు మరియు 500 సంవత్సరాల వర్షపాత ధోరణులను లెక్కలోకి తీసుకోని కాలేశ్వర౦ ప్రాజెక్టు 28 లక్షల క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహాన్ని విడుదల చేసే విధంగా రూపొందించారు. కానీ ప్రస్తుతం అంతకు మించి 108.18 మీటర్ల ఎత్తులో 29 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తిన కారణంగా వరద నీరు నది ప్రవాహ మార్గానికి ఆనుకుని ఉన్న పుంప్‌హౌస్‌లోకి సహజంగానే చేరింది. CWC ప్రకారం, కాలేశ్వరం ప్రాజెక్టులో 103.5 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తే వార్నింగ్ లెవెల్‌గా, 104.75 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తే డేంజర్ లెవెల్‌గా పరిగణిస్తారు. కానీ ఇటీవల 108.18 మీటర్ల ఎత్తులో వరద ప్రవహించింది. ఇది అసాధారణమైనది మరియు పూర్తి స్థాయి మట్టానికి మించినది.

గోదావరి నదికి వరదలు రావడం కొత్తేమి కాదు. 1986లో రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయి. ప్రస్తుత కాలంలో వాతవరణంలో సంభవిస్తున్న పెను మార్పుల కారణంగా క్రమానుగతంగా లేని (uneven) వర్షాలు ఎక్కువగా కుర‌వ‌డం వలన అసాధారణ వరదలు సంభవించాయి. ఈ ఆకస్మిక/అసాధారణ వరదలు తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు. 1980లో ఏర్పాటు చేసిన జాతీయ వరదల కమిషన్ ప్రకారం, దేశం లో వరద ప్రభావిత విస్తీర్ణం నానాటికి పెరుగుతూనే ఉంది.

భారతదేశంలో వర్షాలు మరియు ఆకస్మిక వరదల వలన కలిగిన వైపరీత్యాలు కోకొల్లలు. 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం వద్ద ఉన్న జల విద్యుత్తు కేంద్రం వరదలకు మునిగిపోయింది. ఇక్కడ శ్రీశైలం డ్యాం నీటి విడుదల సామర్థ్యం 13 లక్షల క్యూసెక్కులు, కానీ 25 లక్షల క్యూసెక్కుల వరద డ్యాం లోకి రావడంతో విద్యుత్తు కేంద్రాలు పూర్తిగా మునిగిపోయాయి. కర్నూల్ నగరమంతా వరదల్లో చిక్కుకుపోయింది. 2013లో సంభవించిన ఉత్తరఖండ్ వరదల వలన 5 జల విద్యుత్తు కేంద్రాలు (రిశి గంగా, పీప్లాకోటి, విష్ణు ప్రయాగ్, ధూలి గంగా) పూర్తిగా ధ్వంసం అయ్యాయి. రెండు జల విద్యుత్ కేంద్రాలైతే శిథిలాలు కూడా దొరకనంతగా కొట్టుకుపోయాయి.

2021లో నందాదేవి గ్లేశియర్ బద్దలు కావడం వలన పోటెత్తిన వరదల్లో తపోవన్ అనే జల విద్యుత్తు కేంద్రం నామా రూపాలు లేకుండా కొట్టుకుపొయింది. ఈ వరదలకి 14 మంది మరణించగా , 150 మంది పైగా గల్లంతు అయ్యారు. రూ.1500 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. 2023లో కూడా పనులు పూర్తి అవుతాయా అన్నది కూడా ప్రశ్నార్ధకమే అని కేంద్ర విద్యుత్తు శాఖామంత్రి R K సింగ్ ఒక సందర్భంలో తెలిపారు. దేశంలో దాదాపుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి గానీ, ఆనకట్టలకి వరదలు సంభవిస్తూనే ఉన్నాయి. 2010లో తెహ్రీ డ్యామ్ కి భారీ వరదలు సంభవించి తీవ్ర నష్టం వాటిల్లింది. 2009, 2011, 2014 సంవత్సరాలలో ఒడిశాలోని హిరాకుడ్ డ్యామ్ కి, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న‌ దామోదర్ డ్యామ్ కి కూడా తరచూ వరదలు వ‌చ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహారణలు మనకు లభిస్తాయి.

ఎదైనా ఒక సాగునీటి ప్రాజెక్టు నిర్మించే ముందు దాని డిజైన్ అత్యంత కీలకం. ప్రాజెక్టు ను డిజైన్ చేయడంలో స్థూలంగా 100 నుండి 500 సంవత్సరాల నీటి లభ్యత, వర్షపాతం మరియు గతంలో గరిష్టంగా నమోదైన వరదల పరిమాణాన్ని లెక్కలోకి తీసుకుంటారు. అయినప్పటికి పంప్ హౌస్‌లు, జల విద్యుత్ కేంద్రాలు మునిగిపోతున్నాయి అంటే వాతావరణ మార్పు వలన కలిగే కుంభవృష్టి ద్వారా వచే ఆకస్మిక వరదలే కారణమని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ , జలవనరుల నిపుణులు వివిధ పరిశోధనాత్మక వ్యాసాల్లో వెలువరించారు.

ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ శేఖర్ పాథక్ ప్రకారం, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి, కానీ వాతావరణ మార్పుల యొక్క మారుతున్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని విధానాలను రూపొందిస్తే.. వైపరీత్యాల పరిమాణాన్ని మరియు ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలుగుతామని పేర్కొన్నారు.

First Published:  20 Aug 2022 12:30 AM GMT
Next Story