Telugu Global
Telangana

రూ.1 లక్షలోపు రుణాలు మాఫీ.. రైతు రుణాలకు మొత్తంగా రూ. 7,753.43 కోట్ల చెల్లింపు

ఇప్పటి వరకు 16,66,899 మంది రైతులకు సంబంధించి రూ. 7,753.43 కోట్ల మేర రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసింది.

రూ.1 లక్షలోపు రుణాలు మాఫీ.. రైతు రుణాలకు మొత్తంగా రూ. 7,753.43 కోట్ల చెల్లింపు
X

తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చింది. రూ.1 లక్ష లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు తాజాగా రూ.99,999 వరకు రుణాలను సోమవారం (ఆగస్టు 14) కల్లా తీర్చేసి రైతులకు స్వాతంత్ర దినోత్సవ కానుకను సీఎం కేసీఆర్ అందించారు. గత వారమే రైతులకు ఊరట కలిగించేలా రూ.1లక్ష లోపు రుణాలను మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిధుల విడుదలతో కేసీఆర్ ఇచ్చిన హామీ పూర్తయ్యింది.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం బ్యాంకులకు జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో యుద్ద ప్రాతిపదికన రూ.5,809.78 కోట్లను ఆర్థిక శాఖ బ్యాంకులకు విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని 9,02,843 మంది రైతులను సీఎం కేసీఆర్ రుణాల నుంచి విముక్తి చేశారు.

2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్‌ 11 నాటికి రాష్ట్రంలో రూ. లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చిన విషయం తెల్సిందే. ఎన్నికల హామీలలో కూడా దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి సమగ్ర వివరాలు తెప్పించుకున్నారు.

ఇందుకోసం సమయం పట్టడమే కాకుండా.. అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడం, లాక్‌ డౌన్‌ ఉండడం, దేశంలో నోట్ల రద్దు పర్యవసానాలతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒడిదొడుకులకు గురికావడంతో ప్రభుత్వానికి వనరులు సమకూరడంలో ఇబ్బంది ఏర్పడింది. అయినప్పటికీ ఇప్పటికే రూ.50వేల లోపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతులకు సంబంధించి రూ. 1,943 కోట్లను బ్యాంకులకు చెల్లించింది.

తాజాగా రూ. 99,999 వరకు బ్యాంకులకు అప్పున్న రైతుల రుణాల మాఫీకి రూ.5,809.78 కోట్లను విడుదల చేసింది. ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగం, రైతు రుణమాఫీ గురించి అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించి రైతు రుణమాఫీని అతి త్వరలోనే సంపూర్ణంగా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 45 రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

2014 నాడు తొలి సారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పటి వరకు బ్యాంకులకు రైతులు బకాయిపడ్డ రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో 35,32,000 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరింది. ఇందుకు ప్రభుత్వం రూ.16,144 కోట్లను ఖర్చు పెట్టింది.

ఇప్పటి వరకు 16,66,899 మంది రైతులకు సంబంధించి రూ. 7,753.43 కోట్ల మేర రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసింది.

First Published:  15 Aug 2023 12:00 AM GMT
Next Story